-->

పోలీస్ ఎస్కార్ట్ మధ్య గ్యాస్ సిలిండర్ల సరఫరా

పోలీస్ ఎస్కార్ట్ మధ్య గ్యాస్ సిలిండర్ల సరఫరా


మహబూబాబాద్‌ May 15: తెలంగాణ రాష్ట్రంలో వంటగ్యాస్ కొరత తీవ్ర స్థాయికి చేరిందనే సంకేతాలను ఇస్తూ మహబూబాబాద్ జిల్లాలో ఓ అసాధారణ ఘటన చోటుచేసుకుంది. మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి మండలం పెద్ద ముప్పారం గ్రామంలో శుక్రవారం గ్యాస్ సిలిండర్ల సరఫరాను పోలీసుల ఎస్కార్ట్ మధ్య నిర్వహించడం స్థానికంగా చర్చనీయాంశమైంది.

ప్రస్తుతం మార్కెట్లో గ్యాస్ సిలిండర్ల కొరత నెలకొనడంతో పాటు సిలిండర్ల దొంగతనాలు, లూటీల భయాలు పెరిగిన నేపథ్యంలో డీలర్లు అప్రమత్తమయ్యారు. ఈ పరిస్థితుల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ఉండేందుకు పోలీసుల సహకారంతో గ్రామానికి గ్యాస్ లారీని తీసుకువచ్చారు.

గ్యాస్ లారీ గ్రామంలోకి ప్రవేశించగానే పెద్ద సంఖ్యలో వినియోగదారులు ఒక్కసారిగా అక్కడికి చేరుకున్నారు. దీంతో పరిస్థితి అదుపుతప్పే అవకాశముందని భావించిన పోలీసులు వెంటనే బందోబస్తు నిర్వహించి ప్రజలను క్రమబద్ధీకరించారు. సిలిండర్ల పంపిణీ సజావుగా జరిగేలా ప్రత్యేక పర్యవేక్షణ చేపట్టారు.

నిత్యావసర వస్తువైన వంటగ్యాస్ కోసం ఈ స్థాయిలో పోలీస్ భద్రత ఏర్పాటు చేయాల్సి రావడం ప్రజల్లో ఆందోళన కలిగిస్తోంది. “గ్యాస్ సిలిండర్ కోసం కూడా ఇప్పుడు పోలీస్ ఎస్కార్ట్ అవసరమా?” అంటూ స్థానికులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

ఇదిలా ఉండగా, రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో గ్యాస్ సరఫరాలో అంతరాయాలు ఏర్పడుతున్నాయని వినియోగదారులు ఆరోపిస్తున్నారు. సరఫరా వ్యవస్థను ప్రభుత్వం సమీక్షించి తక్షణ చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793