మే 20న దేశవ్యాప్తంగా మెడికల్ షాపుల బంద్‌కు పిలుపు
న్యూఢిల్లీ, మే 15 : ఆన్‌లైన్ ఫార్మసీల పెరుగుతున్న వ్యాపార ధోరణులకు నిరసనగా మే 20వ తేదీన దేశవ్యాప్తంగా మెడికల్ షాపులు బంద్ కానున్నాయి. ఈ మేరకు All India Organisation of Chemists and Druggists (AIOCD) దేశవ్యాప్త సమ్మెకు పిలుపునిచ్చింది.
ఈ బంద్‌లో భాగంగా దేశవ్యాప్తంగా సుమారు 12.40 లక్షల మెడికల్ షాపులు మూతపడనున్నట్లు సంఘం ప్రతినిధులు తెలిపారు. ఆన్‌లైన్ ఫార్మసీలు నిబంధనలకు విరుద్ధంగా వైద్యుల ప్రిస్క్రిప్షన్ లేకుండానే మందులు విక్రయిస్తున్నాయని, భారీ డిస్కౌంట్లతో చిన్న మెడికల్ షాపుల వ్యాపారాన్ని దెబ్బతీస్తున్నాయని వారు ఆరోపిస్తున్నారు.
ప్రజల ఆరోగ్య భద్రతకు ప్రమాదం కలిగే విధంగా మందుల విక్రయాలు జరుగుతున్నాయని పేర్కొంటూ, ఆన్‌లైన్ ఔషధ విక్రయాలపై కేంద్ర ప్రభుత్వం కఠిన నియంత్రణలు తీసుకురావాలని AIOCD డిమాండ్ చేసింది.
అత్యవసర సేవలకు ఆటంకం కలగకుండా కొంతమంది మెడికల్ షాపులు పరిమితంగా సేవలు అందించే అవకాశమున్నప్పటికీ, దేశవ్యాప్తంగా మందుల కొనుగోలుపై ఈ బంద్ ప్రభావం చూపే అవకాశం ఉందని వ్యాపార వర్గాలు చెబుతున్నాయి.

Post a Comment