-->

రైతుల నుంచి రూ.11 కోట్లు అప్పు తీసుకుని పరార్..

కోదాడలో రియల్ ఎస్టేట్ వ్యాపారిపై ఆందోళన

రైతుల నుంచి రూ.11 కోట్లు అప్పు తీసుకుని పరార్.. కోదాడలో రియల్ ఎస్టేట్ వ్యాపారిపై ఆందోళన

కోదాడ, జూన్ 3: సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణ పరిధిలోని శ్రీరంగాపురంలో ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారి రైతుల నుంచి సుమారు రూ.11 కోట్లు అప్పుగా తీసుకుని కుటుంబ సభ్యులతో కలిసి పరారైన ఘటన తీవ్ర కలకలం రేపింది. తమ కష్టార్జిత సొమ్మును తిరిగి ఇవ్వకుండా తప్పించుకున్నాడంటూ బాధిత రైతులు మంగళవారం అతని ఇంటి ఎదుట ఆందోళనకు దిగారు.

స్థానికుల వివరాల ప్రకారం, రియల్ ఎస్టేట్ వ్యాపారి ఇరిగెల జితేందర్ రెడ్డి గత కొన్ని సంవత్సరాలుగా కోదాడ పరిసర ప్రాంతాల్లో భూముల కొనుగోలు, వెంచర్ల అభివృద్ధి వంటి వ్యాపారాలు నిర్వహిస్తూ రైతులతో సన్నిహిత సంబంధాలు ఏర్పరచుకున్నాడు. ప్రారంభంలో రైతుల వద్ద తీసుకున్న అప్పులను సమయానికి చెల్లిస్తూ వారి నమ్మకాన్ని సంపాదించాడు.

ఈ నమ్మకాన్ని ఆసరాగా చేసుకుని శ్రీరంగాపురానికి చెందిన సుమారు 60 మంది రైతుల వద్ద నుంచి మొత్తం రూ.11 కోట్ల వరకు వడ్డీపై అప్పుగా తీసుకున్నట్లు బాధితులు ఆరోపిస్తున్నారు. ఇటీవల తమ అవసరాల నిమిత్తం డబ్బులు తిరిగి ఇవ్వాలని రైతులు ఒత్తిడి తేవడంతో, జితేందర్ రెడ్డి రెండు రోజుల క్రితం దివాలా (ఐపీ) దాఖలు చేసినట్లు నోటీసులు పంపించి, అనంతరం కుటుంబ సభ్యులతో కలిసి పరారైనట్లు తెలుస్తోంది.

దీంతో ఆగ్రహించిన రైతులు అతని నివాసం ఎదుట ధర్నా నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు. పిల్లల చదువులు, ఆడపిల్లల పెళ్లిళ్లు, కుటుంబ అవసరాల కోసం దాచుకున్న డబ్బును నమ్మకంతో అప్పుగా ఇచ్చామని, ఇప్పుడు మోసపోయామని బాధితులు కన్నీటి పర్యంతమయ్యారు.

సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. చట్టపరంగా ఫిర్యాదు చేసి కేసు నమోదు చేయించుకోవాలని బాధితులకు సూచించారు. అనంతరం వారిని అక్కడి నుంచి పంపించి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు.

ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారగా, బాధిత రైతులు తమ డబ్బులు తిరిగి వచ్చేలా అధికారులు తక్షణ చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793