ఎండల ఎఫెక్ట్.. రెండు నెలల్లో 14 కోట్ల బీర్లు అమ్మకం.. ప్రభుత్వ ఖజానాకు భారీ ఆదాయం
రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల సెల్సియస్‌కు పైగా నమోదవడం, వేసవి సెలవులు, వివాహాల సీజన్ కలిసిరావడంతో బీర్లకు డిమాండ్ గణనీయంగా పెరిగింది. ముఖ్యంగా హైదరాబాద్, సికింద్రాబాద్, మేడ్చల్–మల్కాజిగిరి, రంగారెడ్డి జిల్లాల్లో అత్యధిక అమ్మకాలు నమోదైనట్లు తెలుస్తోంది.
సాధారణంగా రోజుకు సుమారు 1.5 లక్షల కేసుల వరకు ఉండే బీర్ల విక్రయాలు, ఈ వేసవిలో రోజుకు 2.2 లక్షల కేసులకు పెరిగినట్లు వ్యాపార వర్గాలు చెబుతున్నాయి. నగర ప్రాంతాల్లోని వైన్ షాపులు, బార్లు, రెస్టారెంట్లలో వినియోగం గణనీయంగా పెరగడంతో సరఫరాను కూడా పెంచాల్సిన పరిస్థితి ఏర్పడింది.
బీర్ల విక్రయాలు పెరగడంతో ప్రభుత్వ ఖజానాకు ఎక్సైజ్ ఆదాయం రూపంలో భారీగా నిధులు సమకూరుతున్నాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తొలి సంవత్సరాల్లో మద్యం విక్రయాల ద్వారా వార్షికంగా సుమారు రూ.10 వేల కోట్ల ఆదాయం లభించగా, ప్రస్తుతం ఆ ఆదాయం నాలుగు రెట్లు పెరిగినట్లు అధికారిక గణాంకాలు సూచిస్తున్నాయి.
వేసవి కాలంలో చల్లని పానీయాల కంటే బీర్లకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం, స్నేహితుల సమావేశాలు, వేడుకలు, కుటుంబ కార్యక్రమాలు పెరగడం కూడా అమ్మకాల పెరుగుదలకు కారణమని వ్యాపారులు పేర్కొంటున్నారు. ఎండల తీవ్రత కొనసాగుతున్న నేపథ్యంలో రానున్న రోజుల్లో కూడా బీర్ల విక్రయాలు ఇదే స్థాయిలో కొనసాగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.

Post a Comment