దేశవ్యాప్తంగా 16 రకాల మందులపై కేంద్రం ప్రభుత్వం నిషేధం
దేశవ్యాప్తంగా 16 రకాల మందులపై కేంద్రం ప్రభుత్వం నిషేధం
ప్రజారోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వైద్యపరమైన ప్రయోజనాలకు తగిన శాస్త్రీయ ఆధారాలు లేవని, రోగులకు ప్రమాదం కలిగించే అవకాశం ఉందని నిపుణుల కమిటీ నివేదిక తేల్చడంతో 16 రకాల ఫిక్స్‌డ్ డోస్ కాంబినేషన్ (FDC) ఔషధాల తయారీ, విక్రయాలు, పంపిణీపై తక్షణమే నిషేధం విధించింది. ఈ నిర్ణయాన్ని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ డ్రగ్స్ అండ్ కాస్మెటిక్స్ యాక్ట్-1940లోని సెక్షన్ 26A కింద అమలు చేసింది.
FDC మందులు అంటే ఏమిటి?
రెండు లేదా అంతకంటే ఎక్కువ ఔషధ పదార్థాలను ఒకే టాబ్లెట్, క్యాప్సూల్ లేదా సిరప్‌లో నిర్దిష్ట మోతాదులో కలిపి తయారు చేసే మందులను ఫిక్స్‌డ్ డోస్ కాంబినేషన్ (FDC) మందులు అంటారు. ఇటువంటి మందుల భద్రత, ప్రయోజనాలపై సమీక్ష నిర్వహించిన నిపుణుల కమిటీ 16 కాంబినేషన్లను “థెరప్యూటిక్ జస్టిఫికేషన్ లేని మందులు”గా గుర్తించింది.
నిషేధిత జాబితాలో ఉన్న ముఖ్యమైన కాంబినేషన్లు
- అమోక్సిసిలిన్ + సెర్రాటియోపెప్టిడేస్
- అమోక్సిసిలిన్ + సెర్రాటియోపెప్టిడేస్ + లాక్టోబాసిల్లస్ స్పోరోజెనస్
- సెఫురోక్సిమ్ + సెర్రాటియోపెప్టిడేస్
- ఎసిటైల్ సాలిసిలిక్ యాసిడ్ + ఇథోహెప్టాజైన్
- డైసైక్లోమైన్ + పారాసిటమాల్ + క్లిడినియం బ్రోమైడ్
- కొన్ని చర్మ సంరక్షణ లోషన్లు, క్రీములు (అలోవెరా, విటమిన్-E, జోజోబా ఆయిల్, టీ ట్రీ ఆయిల్ వంటి పదార్థాల కాంబినేషన్లు)
కేంద్రం హెచ్చరిక
ఈ నిషేధిత మందుల తయారీ, అమ్మకాలు, పంపిణీ, నిల్వలను వెంటనే నిలిపివేయాలని ఫార్మా కంపెనీలు, డిస్ట్రిబ్యూటర్లు, మెడికల్ షాపులకు ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్ర డ్రగ్ కంట్రోల్ శాఖలు కఠినంగా అమలు చేయాలని కేంద్రం సూచించింది. నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తీసుకునే అవకాశం ఉంది.
గమనిక: మీరు ప్రస్తుతం వాడుతున్న మందులు ఈ జాబితాలో ఉన్నాయో లేదో అనుమానం ఉంటే, వాటిని స్వయంగా ఆపకుండా వైద్యుడిని లేదా ఫార్మసిస్ట్‌ను సంప్రదించడం మంచిది.

Post a Comment