-->

సింగరేణి ఉద్యోగాలపై కవిత అల్టిమేటం.. జులై 20 నుంచి నిరాహార దీక్ష హెచ్చరిక

 

సింగరేణి ఉద్యోగాలపై కవిత అల్టిమేటం.. జులై 20 నుంచి నిరాహార దీక్ష హెచ్చరిక

సింగరేణి ఉద్యోగాలపై కవిత అల్టిమేటం.. జులై 20 నుంచి నిరాహార దీక్ష హెచ్చరిక

జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో నిర్వహించిన ‘సింగరేణి బాయిబాట’ కార్యక్రమంలో తెలంగాణ రక్షణ సేన పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేటీకే-5 గనిని సందర్శించిన ఆమె, కాంగ్రెస్ ప్రభుత్వం మరియు సింగరేణి యాజమాన్యం తీరుపై తీవ్ర విమర్శలు చేశారు.

సింగరేణిలో మెడికల్ అన్‌ఫిట్ కారణంగా ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసి పెండింగ్‌లో ఉన్న సుమారు 1,200 మంది వారసులకు వెంటనే ఉద్యోగాలు కల్పించాలని ఆమె డిమాండ్ చేశారు. ఇందుకోసం ప్రభుత్వానికి నెల రోజుల గడువు ఇస్తున్నామని, ఆలోగా సమస్య పరిష్కరించకపోతే జులై 20 నుంచి నిరాహార దీక్ష చేపడతానని హెచ్చరించారు.

సింగరేణిలో ఏ చిన్న పని జరగాలన్నా డిప్యూటీ సీఎం కార్యాలయం నుంచి లంచాలు అడుగుతున్నారని కవిత ఆరోపించారు. కాంగ్రెస్ పాలనలో లాభాల్లో ఉన్న సింగరేణిని నష్టాల బాట పట్టిస్తున్నారని విమర్శించారు. ఇటీవల జరిగిన ప్రమాదంలో ఒక కార్మికుడు తీవ్రంగా గాయపడటానికి నాసిరకం డిటోనేటర్ల వినియోగమే కారణమని ఆమె ఆరోపించారు.

గనుల్లో పనిచేసే కార్మికులకు కనీస సౌకర్యాలైన స్వచ్ఛమైన గాలి, తాగునీరు కూడా అందడం లేదని కవిత ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే రిటైర్ అయిన కార్మికుల కోసం ప్రత్యేక హౌసింగ్ బోర్డు ఏర్పాటు చేసి, ఇల్లు నిర్మించుకునేందుకు ప్రభుత్వం లేదా కార్మిక సంఘాల తరఫున రూ.10 లక్షల ఆర్థిక సాయం అందించాలని డిమాండ్ చేశారు.

విజిలెన్స్ విచారణల పేరుతో కార్మికులను భయపెట్టవద్దని సూచించిన ఆమె, తెలంగాణ ఉద్యమం నుంచి సింగరేణి కార్మికులతో తనకు అనుబంధం ఉందని గుర్తుచేశారు. రాష్ట్ర హక్కుల పరిరక్షణ కోసం తాను స్థాపించిన తెలంగాణ రక్షణ సేనకు భూపాలపల్లి ప్రజలు, సింగరేణి కార్మికులు మద్దతు ఇవ్వాలని కోరారు.

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793