-->

అంతర్‌రాష్ట్ర కరుడుగట్టిన దొంగ అరెస్ట్.. 61 కేసులు నమోదు, రిమాండ్‌కు తరలింపు

అంతర్‌రాష్ట్ర కరుడుగట్టిన దొంగ అరెస్ట్.. 61 కేసులు నమోదు, రిమాండ్‌కు తరలింపు

అంతర్‌రాష్ట్ర కరుడుగట్టిన దొంగ అరెస్ట్.. 61 కేసులు నమోదు, రిమాండ్‌కు తరలింపు

వికారాబాద్, జూన్ 4: వికారాబాద్ జిల్లాలో సంచలనం సృష్టించిన చోరీ కేసును పోలీసులు ఛేదించి, అంతర్‌రాష్ట్ర కరుడుగట్టిన దొంగ వికాస్ సింగ్ అలియాస్ తేజా సింగ్‌ను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు జిల్లా ఎస్పీ స్నేహ మెహ్రా వెల్లడించారు. గురువారం జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె కేసు వివరాలను వెల్లడించారు.

గత నెల 5వ తేదీన వికారాబాద్ పట్టణంలోని మణికంఠ నగర్ కాలనీలో ఓ ఇంట్లోకి చొరబడి సుమారు ఒకటిన్నర తులాల బంగారు ఆభరణాలు, రూ.2.10 లక్షల నగదు అపహరించిన ఘటనపై బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. ఈ కేసును అత్యంత ప్రాధాన్యంగా తీసుకున్న పోలీసులు సాంకేతిక ఆధారాలు, సీసీటీవీ ఫుటేజీలు, నిఘా సమాచారాన్ని విశ్లేషించి దర్యాప్తు చేపట్టారు.

డీఎస్పీ అంజయ్య పర్యవేక్షణలో సీసీఎస్ ఇన్‌స్పెక్టర్ బల్వంత్ రాయ్, వికారాబాద్ ఇన్‌స్పెక్టర్ రఘుకుమార్ నేతృత్వంలోని ప్రత్యేక బృందం నిందితుడిని గుర్తించి అదుపులోకి తీసుకుంది.

16 ఏళ్ల వయసులోనే నేరజీవితం ప్రారంభం

పోలీసుల విచారణలో వికాస్ సింగ్ గురించి సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఉత్తరప్రదేశ్‌కు చెందిన అతడు 16 ఏళ్ల వయసులోనే నేరజీవితాన్ని ప్రారంభించినట్లు తేలింది. సంగారెడ్డి, బొల్లారం ప్రాంతాల్లో అతనిపై గతంలో 34 రాత్రిపూట చోరీ కేసులు నమోదయ్యాయి. 2018లో నాలుగు, 2021లో తొమ్మిది, 2022లో 21 కేసుల్లో అరెస్టై జైలు శిక్ష అనుభవించిన అతడు 2024 జూన్ 26న విడుదలయ్యాడు.

అయితే విడుదలైన తర్వాత కూడా మార్పు రాకపోవడంతో వికారాబాద్, సైబరాబాద్, మల్కాజిగిరి పరిధుల్లో మరో 27 చోరీలకు పాల్పడినట్లు ఒప్పుకున్నాడు. ఈ కేసుల్లో మొత్తం 157 తులాల బంగారం, 256 తులాల వెండి, రూ.8.22 లక్షల నగదు దొంగిలించినట్లు విచారణలో వెల్లడించాడు.

దొంగసొమ్ముతో విలాస జీవితం.. సేవా కార్యక్రమాల ముసుగు

చోరీల ద్వారా సంపాదించిన డబ్బుతో వికాస్ సింగ్ విలాసవంతమైన జీవితం గడిపేవాడని పోలీసులు తెలిపారు. తన స్వగ్రామంలో "హెల్పింగ్ హ్యాండ్" పేరుతో ఎన్జీవో నిర్వహిస్తూ పేద విద్యార్థులకు బ్యాగులు, నోట్‌బుక్లు పంపిణీ చేయడం, స్నేహితులను చెన్నై, గోవా, విజయవాడ, విశాఖపట్నం, బెంగళూరు, రాజస్థాన్, డెహ్రాడూన్ తదితర ప్రాంతాలకు విహారయాత్రలకు తీసుకెళ్లడం ద్వారా స్థానికంగా మంచి పేరు సంపాదించుకున్నట్లు గుర్తించారు.

దొంగసొమ్ము కొనుగోలు చేసిన బంగారం వ్యాపారుల ముఠా

దొంగిలించిన బంగారు ఆభరణాలను ఉత్తరప్రదేశ్‌లోని సుల్తాన్‌పూర్ జిల్లాకు చెందిన పలువురు బంగారం వ్యాపారులకు విక్రయించినట్లు విచారణలో తేలింది. శ్యామ్ మోహన్, సూరజ్ మోహన్, అశోక్ సోని, వికాస్ అగ్రహారి తదితరులు దొంగసొమ్ము కొనుగోలు చేసినట్లు పోలీసులు గుర్తించారు.

వీరు కేవలం బంగారం కొనుగోలు చేయడమే కాకుండా మరిన్ని దొంగతనాలకు ప్రోత్సహించారని నిందితుడు వెల్లడించినట్లు ఎస్పీ తెలిపారు. తాను దొంగతనాలకు భయపడిన సమయంలో రూ.40 వేల నగదు ఇచ్చి అక్రమంగా తుపాకీ కొనుగోలు చేయడానికి కూడా ప్రోత్సహించారని విచారణలో ఒప్పుకున్నాడని చెప్పారు.

తుపాకీ సహా బంగారం స్వాధీనం

నిందితుడి వద్ద నుంచి ఒకటిన్నర తులాల బంగారు ఆభరణాలు, 5 ఎంఎం పిస్తోల్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం అతనిపై పాత 34 కేసులు, కొత్తగా ఒప్పుకున్న 27 కేసులు కలిపి మొత్తం 61 కేసులు నమోదైనట్లు ఎస్పీ వెల్లడించారు.

రిసీవర్లపై కఠిన చర్యలు

దొంగసొమ్ము కొనుగోలు చేసిన వ్యాపారులపై కూడా ఆర్గనైజ్డ్ క్రైమ్, ఆర్మ్స్ యాక్ట్ తదితర చట్టాల కింద కేసులు నమోదు చేస్తున్నట్లు ఎస్పీ తెలిపారు. అవసరమైతే పీడీ యాక్ట్ కూడా ప్రయోగిస్తామని హెచ్చరించారు. వీరిని అరెస్ట్ చేయడానికి ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు.

పోలీసు బృందానికి ప్రశంసలు

అంతర్‌రాష్ట్ర దొంగను అత్యంత చాకచక్యంగా పట్టుకున్న డీఎస్పీ అంజయ్య, సీసీఎస్ ఇన్‌స్పెక్టర్ బల్వంత్ రాయ్, ఇన్‌స్పెక్టర్ రఘుకుమార్‌తో పాటు దర్యాప్తు బృంద సభ్యులను ఎస్పీ స్నేహ మెహ్రా ప్రత్యేకంగా అభినందించి రివార్డులు అందజేశారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అనుమానాస్పద వ్యక్తుల సమాచారం వెంటనే పోలీసులకు అందించాలని ఆమె విజ్ఞప్తి చేశారు.

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793