-->

విద్యార్థులకు సూపర్ గుడ్‌న్యూస్.. ఇకపై నేరుగా మీ ఖాతాల్లోకే ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్‌లు!

విద్యార్థులకు సూపర్ గుడ్‌న్యూస్.. ఇకపై నేరుగా మీ ఖాతాల్లోకే ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్‌లు!

విద్యార్థులకు సూపర్ గుడ్‌న్యూస్.. ఇకపై నేరుగా మీ ఖాతాల్లోకే ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్‌లు!

హైదరాబాద్, జూన్ 6: తెలంగాణ ప్రభుత్వం విద్యార్థులకు భారీ ఊరట కలిగించే కీలక నిర్ణయం తీసుకోనుంది. రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ, మైనార్టీ, దివ్యాంగ విద్యార్థులకు అందించే ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్‌ల పంపిణీ విధానంలో సంస్కరణలు చేపట్టాలని నిర్ణయించింది. 2026-27 విద్యా సంవత్సరం నుంచి అర్హులైన విద్యార్థుల బ్యాంకు ఖాతాల్లోకే నేరుగా నిధులు జమ చేసే కొత్త విధానాన్ని అమలు చేయడానికి ప్రభుత్వం సిద్ధమవుతోంది.

ప్రస్తుతం ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్‌ల విడుదలలో జాప్యం కారణంగా విద్యార్థులు, కళాశాల యాజమాన్యాలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేందుకు దరఖాస్తు ఆమోదం పొందిన నెల రోజుల్లోనే ఫీజులు, ఉపకారవేతనాలు విడుదల చేసే విధానాన్ని ప్రభుత్వం రూపొందిస్తోంది.

కొత్త విధానం ప్రకారం ప్రభుత్వం విడుదల చేసిన ఫీజు మొత్తాన్ని విద్యార్థులు ఏడు రోజుల్లోగా సంబంధిత కళాశాలకు చెల్లించాల్సి ఉంటుంది. నిర్దేశిత గడువులో ఫీజు చెల్లించకపోతే ఆ మొత్తాన్ని విద్యార్థుల నుంచి తిరిగి వసూలు చేసే నిబంధనను కూడా అమలు చేయనున్నారు.

ఆధార్, బ్యాంకు ఖాతా తప్పనిసరి

ఈ పథకం ప్రయోజనాలు పొందాలంటే విద్యార్థుల ఆధార్ కార్డులో ఉన్న పేరు, విద్యా రికార్డుల్లోని పేరు ఒకే విధంగా ఉండాలి. అలాగే ఆధార్‌తో అనుసంధానమైన బ్యాంకు ఖాతా తప్పనిసరిగా ఉండాల్సి ఉంటుంది. ఆధార్ ధ్రువీకరణ, కళాశాల డిజిటల్ సిగ్నేచర్, జిల్లా సంక్షేమాధికారి ఆమోదం పూర్తయిన తర్వాతే నిధులు విడుదల కానున్నాయి.

ఈ-పాస్ పోర్టల్‌కు విద్యాశాఖ డేటా అనుసంధానం

ఫీజులు, స్కాలర్‌షిప్‌ల పంపిణీ ప్రక్రియను మరింత పారదర్శకంగా, వేగవంతంగా మార్చేందుకు ఈ-పాస్ పోర్టల్‌ను విద్యాశాఖ డేటాబేస్‌తో అనుసంధానం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో విద్యార్థుల ప్రవేశ వివరాలు, అర్హత సమాచారం నేరుగా అందుబాటులోకి వచ్చి దరఖాస్తుల పరిశీలన ప్రక్రియ త్వరగా పూర్తయ్యే అవకాశం ఉంది.

ప్రతి నెలా రూ.200 కోట్ల విడుదలకు ప్రణాళిక

నిధుల కొరత కారణంగా బకాయిలు పేరుకుపోకుండా ప్రతి నెలా సుమారు రూ.200 కోట్లను విడుదల చేసేలా ప్రభుత్వం కార్యాచరణ రూపొందిస్తోంది. విద్యా సంవత్సరం పూర్తయ్యేలోపు ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్‌లన్నింటినీ పూర్తిగా చెల్లించాలనే లక్ష్యంతో చర్యలు చేపడుతోంది.

అయితే ఈ ప్రయోజనాలు పొందాలంటే విద్యార్థులు కనీసం 70 శాతం హాజరు నమోదు చేయడం తప్పనిసరి అని ప్రభుత్వం స్పష్టం చేసింది.

త్వరలో అధికారిక ఉత్తర్వులు

సంక్షేమ శాఖలతో జరిగిన చర్చల అనంతరం ఈ ప్రతిపాదనలకు రూపురేఖలు ఖరారయ్యాయి. సంబంధిత దస్త్రానికి మంత్రి అడ్లూరి లక్ష్మణ్ ఆమోదం తెలిపినట్లు సమాచారం. త్వరలో ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి ఆమోదం అనంతరం అధికారిక ఉత్తర్వులు జారీ కానున్నాయి.

ఈ కొత్త విధానం అమల్లోకి వస్తే వేలాది మంది విద్యార్థులకు ఫీజుల భారం తగ్గడంతో పాటు స్కాలర్‌షిప్‌లు సకాలంలో అందే అవకాశం ఏర్పడనుంది. విద్యార్థుల విద్యాభ్యాసానికి ఇది మరింత భరోసా కలిగించే నిర్ణయంగా భావిస్తున్నారు.

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793