ఒకే కుటుంబానికి చెందిన నలుగురి మృతదేహాలు వెలికితీత
నల్గొండ జిల్లాలో ఘోర విషాదం.. ఒకే కుటుంబానికి చెందిన నలుగురి మృతదేహాలు వెలికితీత
నల్గొండ జిల్లాలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. పట్టణంలోని తెలంగాణ కాలనీలో ఓ ఇంట్లో నలుగురు అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ఇంటి నుంచి దుర్వాసన రావడంతో అనుమానం చెందిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.
సమాచారం అందుకున్న నల్గొండ వన్‌టౌన్ పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకుని ఇంటిని పరిశీలించారు. ఇంట్లో నలుగురు మృతదేహాలు ఉండటాన్ని గుర్తించారు. ప్రాథమికంగా వీరంతా సుమారు నాలుగు రోజుల క్రితమే విషం సేవించి మృతి చెంది ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. మృతదేహాలు పూర్తిగా కుళ్లిపోయిన స్థితిలో ఉండటంతో ఘటన ఎప్పుడు జరిగిందనే అంశంపై అధికారులు ఆరా తీస్తున్నారు.
అయితే ఈ కుటుంబానికి చెందిన మరో యువకుడు ప్రస్తుతం కనిపించకపోవడం కేసులో కొత్త మలుపు తీసుకొచ్చింది. దీంతో ఇది కేవలం ఆత్మహత్య కేసేనా, లేక మరేదైనా అనుమానాస్పద పరిస్థితులు ఉన్నాయా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. హత్యకు సంబంధించిన అవకాశాలను కూడా పరిశీలిస్తున్నట్లు సమాచారం.
మృతుల వివరాలు, ఆత్మహత్యకు లేదా ఘటనకు దారితీసిన కారణాలు ఇంకా తెలియరాలేదు. కుటుంబ సభ్యుల ఆర్థిక, వ్యక్తిగత, కుటుంబ పరిస్థితులపై పోలీసులు విచారణ చేపట్టారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
ఈ విషాద ఘటనతో తెలంగాణ కాలనీతో పాటు నల్గొండ జిల్లాలో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి. కేసు నమోదు చేసిన పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

Post a Comment