డొనాల్డ్ ట్రంప్ అవెన్యూ శిలాఫలకంలో కనిపించని భట్టి పేరు
డొనాల్డ్ ట్రంప్ అవెన్యూ శిలాఫలకంలో కనిపించని భట్టి పేరు.. కార్యక్రమంలో ఆసక్తికర పరిణామం
హైదరాబాద్, జూన్ 24: గచ్చిబౌలిలోని అమెరికా కాన్సులేట్‌కు వెళ్లే రోడ్డుకు "డొనాల్డ్ ట్రంప్ అవెన్యూ"గా నామకరణం చేసిన కార్యక్రమంలో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. అమెరికా స్వాతంత్య్రానికి 250 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా నిర్వహించిన ఈ కార్యక్రమానికి తెలంగాణ డిప్యూటీ ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
అమెరికా ప్రతినిధి సెర్జియో గోర్‌తో కలిసి భట్టి విక్రమార్క శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. కార్యక్రమం ప్రారంభం వరకు అంతా సజావుగానే సాగినా, శిలాఫలకంపై ఉన్న వివరాలు చూసిన తర్వాత అక్కడ చర్చ మొదలైంది.
శిలాఫలకంపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, అమెరికా ప్రతినిధి సెర్జియో గోర్ పేర్లు మాత్రమే ఉండగా, స్వయంగా శిలాఫలకాన్ని ఆవిష్కరించిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పేరు లేకపోవడం అందరి దృష్టిని ఆకర్షించింది.
సాధారణంగా ప్రభుత్వ కార్యక్రమాల్లో శంకుస్థాపన లేదా ప్రారంభోత్సవ శిలాఫలకాలపై కార్యక్రమానికి హాజరైన ముఖ్య అతిథులు, ప్రజాప్రతినిధుల పేర్లు పొందుపరచడం ఆనవాయితీ. అయితే ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం పేరు లేకపోవడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
శిలాఫలకాన్ని ఆవిష్కరించే సమయంలో భట్టి విక్రమార్క చిరునవ్వుతో కనిపించినప్పటికీ, అనంతరం శిలాఫలకాన్ని పరిశీలించిన తర్వాత ఆయన ముఖంలో ఆశ్చర్యం వ్యక్తమైనట్లు అక్కడ ఉన్నవారు పేర్కొన్నారు. ఈ ఘటనపై అధికారికంగా ఎలాంటి వివరణ వెలువడకపోయినా, కార్యక్రమానికి హాజరైన పలువురు నేతలు, అధికారులు దీనిపై చర్చించుకోవడం కనిపించింది.
ఈ ఘటన ప్రస్తుతం రాజకీయ, సామాజిక వర్గాల్లో ఆసక్తికర చర్చకు దారితీసింది. శిలాఫలకంపై డిప్యూటీ సీఎం పేరు ఎందుకు పొందుపరచలేదనే అంశంపై వివిధ ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

Post a Comment