-->

తెలంగాణలో ఏసీబీ దాడులు.. ఇద్దరు ఉన్నతాధికారుల ఇళ్లలో కిలోల కొద్దీ బంగారం, కోట్లలో నగదు!

తెలంగాణలో ఏసీబీ దాడులు.. ఇద్దరు ఉన్నతాధికారుల ఇళ్లలో కిలోల కొద్దీ బంగారం, కోట్లలో నగదు!
 తెలంగాణలో ఏసీబీ దాడులు.. ఇద్దరు ఉన్నతాధికారుల ఇళ్లలో కిలోల కొద్దీ బంగారం, కోట్లలో నగదు!

హైదరాబాద్: తెలంగాణలో అవినీతి అధికారులపై అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) ఉక్కుపాదం మోపుతోంది. ఆదాయానికి మించిన ఆస్తుల కేసుల్లో భాగంగా ఇద్దరు ఉన్నతాధికారులపై నిర్వహించిన దాడుల్లో భారీగా నగదు, బంగారం, స్థిరాస్తులు వెలుగులోకి రావడంతో రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.

నిజామాబాద్ జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ మల్లా రెడ్డి నివాసంతో పాటు ఆయనకు సంబంధించిన పలు ప్రాంతాల్లో ఏసీబీ అధికారులు ఉదయం నుంచే ముమ్మర సోదాలు చేపట్టారు. ఆయన ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్నారనే ఆరోపణలపై ఈ తనిఖీలు నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు. సోదాల సమయంలో పలు కీలక పత్రాలు, ఆస్తులకు సంబంధించిన వివరాలను స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం.

ఇదే సమయంలో సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ శాఖ డిప్యూటీ డైరెక్టర్ ఎస్. నరహరి రావు కేసులో ఏసీబీ సంచలన విషయాలను వెలికితీసింది. ఇప్పటికే అరెస్టైన నరహరి రావుకు కోర్టు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. దర్యాప్తులో భాగంగా షాఅలీబండలోని కెనరా బ్యాంకులో ఆయన భార్య పేరిట ఉన్న రెండు లాకర్లను అధికారులు తెరిచి పరిశీలించగా, అందులో రూ.1.50 కోట్ల నగదుతో పాటు భారీ మొత్తంలో బంగారు ఆభరణాలు లభించాయి.

నరహరి రావుకు చెందిన ఇళ్లు, బినామీల స్థావరాల్లో నిర్వహించిన సోదాల్లో గచ్చిబౌలి, చత్రినాక ప్రాంతాల్లో బహుళ అంతస్తుల భవనాలు, అలాగే రంగారెడ్డి జిల్లా మహేశ్వరం, పుప్పాలగూడ, నార్సింగి, రాజేంద్రనగర్ ప్రాంతాల్లో విలువైన ప్లాట్లు, ఫ్లాట్లు, వ్యవసాయ భూములు ఉన్నట్లు ఏసీబీ గుర్తించింది.

అధికారుల లెక్కల ప్రకారం నరహరి రావు ఇల్లు, లాకర్లలో కలిపి మొత్తం రూ.1.54 కోట్ల నగదు, రూ.2.29 కోట్ల బ్యాంక్ బ్యాలెన్స్, రూ.5.04 కోట్ల ఫిక్స్‌డ్ డిపాజిట్లు, 1.3 కిలోల బంగారం, 8 కిలోల వెండి లభించాయి. స్వాధీనం చేసుకున్న ఆస్తుల డాక్యుమెంట్ విలువ రూ.13.05 కోట్లుగా తేలింది. అయితే బహిరంగ మార్కెట్‌లో వీటి విలువ మరింత ఎక్కువగా ఉండే అవకాశముందని ఏసీబీ అధికారులు పేర్కొన్నారు.

ఈ రెండు కేసుల్లోనూ ఏసీబీ దర్యాప్తు కొనసాగుతోంది. ఇంకా మరిన్ని ఆస్తులు, ఆర్థిక లావాదేవీల వివరాలు బయటపడే అవకాశముందని అధికారులు వెల్లడించారు. రాష్ట్రంలో అవినీతి నిరోధక చర్యలను మరింత కఠినంగా అమలు చేస్తున్న నేపథ్యంలో ఈ దాడులు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793