మిర్యాలగూడలో ఘోర విషాదం.. గ్యాస్ సిలిండర్ పేలి నిద్రలోనే ముగ్గురు సజీవదహనం
మిర్యాలగూడలో ఘోర విషాదం.. గ్యాస్ సిలిండర్ పేలి నిద్రలోనే ముగ్గురు సజీవదహనం
నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలో హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. అర్ధరాత్రి జరిగిన అగ్నిప్రమాదంలో ఓ మహిళతో పాటు ఆమె మనవడు, మనవరాలు సజీవ దహనమయ్యారు.
స్థానికుల వివరాల ప్రకారం, మిర్యాలగూడ పట్టణంలోని కలాల్‌వాడ ప్రాంతానికి చెందిన వనం చంద్రకళ (45) తన మనవళ్లు లక్ష్మణ్ (16), ప్రణతి (14)లతో కలిసి ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. గురువారం అర్ధరాత్రి తర్వాత ఇంట్లో విద్యుదాఘాతం కారణంగా ఒక్కసారిగా మంటలు చెలరేగినట్లు తెలుస్తోంది. మంటలు వేగంగా వ్యాపించడంతో ఇంట్లో ఉన్న ముగ్గురూ బయటకు వచ్చే అవకాశం లేక చిక్కుకుపోయారు.
మంటలను గమనించిన స్థానికులు వెంటనే సహాయక చర్యలు చేపట్టారు. అయితే మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్న సమయంలో ఇంట్లో ఉన్న గ్యాస్ సిలిండర్ భారీ శబ్దంతో పేలిపోవడంతో మంటలు మరింత ఉధృతమయ్యాయి. దీంతో ఇంటి మొత్తం అగ్నికి ఆహుతైంది.
ఈ ఘటనలో చంద్రకళ, లక్ష్మణ్, ప్రణతి అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. అనంతరం పూర్తిగా కాలిపోయిన మృతదేహాలను వెలికితీసి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
ఘటన స్థలాన్ని డీఎస్పీ రాజశేఖర్‌రాజు, సీఐ నాగభూషణరావు తదితర అధికారులు పరిశీలించారు. అగ్నిప్రమాదానికి గల ఖచ్చితమైన కారణాలపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
వరుస విషాదాలతో కుటుంబం శోకసంద్రంలో..
ఈ కుటుంబాన్ని గత కొన్నేళ్లుగా వరుస విషాదాలు వెంటాడుతున్నాయి. చంద్రకళ భర్త సైదులు నెల రోజుల క్రితమే అనారోగ్యంతో మృతి చెందగా, పెద్ద కుమార్తె ధనమ్మ భర్త కూడా పదేళ్ల క్రితం మరణించాడు. అప్పటి నుంచి ధనమ్మ తన ఇద్దరు పిల్లలతో తల్లిదండ్రుల వద్దే నివసిస్తోంది.
కుటుంబ పోషణ కోసం కేవలం మూడు రోజుల క్రితమే పుణెకు వెళ్లిన ధనమ్మకు తన తల్లి, ఇద్దరు పిల్లలు అగ్నిప్రమాదంలో మృతి చెందిన విషాద వార్త అందడంతో కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీరుమున్నీరవుతున్నారు. ఈ ఘటన మిర్యాలగూడ పట్టణంలో తీవ్ర విషాదాన్ని నింపింది.

Post a Comment