ఖమ్మం జిల్లాలో సాగునీటి ప్రాజెక్టులపై భట్టి విక్రమార్క్ సమీక్ష
ఖమ్మం జిల్లాలో సాగునీటి ప్రాజెక్టులపై భట్టి విక్రమార్క్ సమీక్ష
హైదరాబాద్ జలసౌధలో ఉమ్మడి ఖమ్మం జిల్లా పరిధిలోని నీటిపారుదల ప్రాజెక్టుల పురోగతి, సాగునీటి విస్తరణ లక్ష్యాలపై ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో కలిసి ప్రత్యేక సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ, సీతారామ ప్రాజెక్టుకు పూర్తి స్థాయిలో నీరు అందించాలంటే కీలకమైన సీతమ్మ సాగర్ బ్యారేజీ నిర్మాణం వేగంగా పూర్తికావాలని పేర్కొన్నారు. ప్రాజెక్టుకు అడ్డంకిగా ఉన్న ఎన్జీటీ క్లియరెన్స్, ఇతర చట్టపరమైన సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటోందని తెలిపారు. ఈ అంశాలపై అడ్వకేట్ జనరల్‌తో నిరంతరం సంప్రదింపులు కొనసాగుతున్నాయని వెల్లడించారు.
సాగునీటి శాఖ అధికారులు ఈ ప్రాజెక్టుపై ప్రత్యేక చొరవ చూపి, పనుల పురోగతిని నిరంతరం పర్యవేక్షించాలని ఆదేశించారు. అలాగే ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని గిరిజన నియోజకవర్గాల అభివృద్ధి, సాగునీటి వసతుల కల్పనకు ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని చెప్పారు. స్థానిక జల వనరులను గుర్తించి త్వరితగతిన వినియోగంలోకి తీసుకురావాలని సూచించారు.
జిల్లాలో కొనసాగుతున్న ప్రాజెక్టులు, కొత్త ప్రతిపాదనల నివేదికలను ప్రాధాన్యత క్రమంలో ఆర్థిక శాఖకు పంపితే నిధుల విడుదల, బిల్లుల చెల్లింపులు వేగవంతం చేస్తామని హామీ ఇచ్చారు. తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఎకరాలకు సాగునీరు అందించే చిన్న తరహా ప్రాజెక్టులపై అధికారులు దృష్టి సారించాలని సూచించారు.
ప్రాజెక్టుల నిర్మాణంలో కీలకమైన భూసేకరణ, పునరావాసం (ఆర్ & ఆర్) ప్యాకేజీలకు సంబంధించిన పెండింగ్ బిల్లుల చెల్లింపులకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని తెలిపారు. జిల్లా కలెక్టర్లతో సమన్వయం చేసుకుని పెండింగ్ అంశాలను త్వరగా పరిష్కరించాలని అధికారులకు సూచించారు.
ఈ సమావేశంలో మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాస రెడ్డి, వాకిటి శ్రీహరితో పాటు ఇతర ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Post a Comment