అక్రమ సారా తయారీ, రవాణా, విక్రయాలపై కఠిన చర్యలు.. కరకగూడెం పోలీసుల మెరుపు దాడులు
అక్రమ సారా తయారీ, రవాణా, విక్రయాలపై కఠిన చర్యలు.. కరకగూడెం పోలీసుల మెరుపు దాడులు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండలంలో అక్రమ సారా తయారీ, రవాణా, విక్రయాలపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. జిల్లా పోలీసు అధికారుల ఆదేశాల మేరకు కరకగూడెం పోలీసులు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి, అక్రమ సారా తయారీ కేంద్రాలపై వరుసగా మెరుపు దాడులు నిర్వహిస్తున్నారు.
ఈ క్రమంలో కలవలనాగారం గ్రామ సమీపంలోని అటవీ ప్రాంతంలో అక్రమంగా సారా తయారీ జరుగుతోందన్న విశ్వసనీయ సమాచారం మేరకు పోలీసులు దాడులు చేపట్టారు. దాడుల్లో సుమారు 500 లీటర్ల బెల్లం పానకాన్ని ధ్వంసం చేయడంతో పాటు, సారా తయారీకి ఉపయోగిస్తున్న డ్రమ్‌లు, పాత్రలు, ఇతర సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు.
పోలీసుల రాకను గమనించిన కొందరు నిందితులు అక్కడి నుంచి పరారైనట్లు సమాచారం. పరారీలో ఉన్న వారి గుర్తింపునకు చర్యలు చేపట్టిన పోలీసులు, త్వరలోనే వారిని అదుపులోకి తీసుకుంటామని తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
అక్రమ సారా తయారీ, విక్రయాలు ప్రజల ఆరోగ్యానికి తీవ్ర ముప్పుగా మారుతున్న నేపథ్యంలో ఇలాంటి కార్యకలాపాలకు పాల్పడే వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కడైనా అక్రమ సారా తయారీ లేదా విక్రయాలు జరుగుతున్నట్లు సమాచారం తెలిసిన వెంటనే పోలీసులకు తెలియజేయాలని ప్రజలను కోరారు.
జిల్లాలో అక్రమ సారా నిర్మూలన కోసం ఇలాంటి ప్రత్యేక దాడులు నిరంతరం కొనసాగుతాయని కరకగూడెం పోలీసులు స్పష్టం చేశారు.

Post a Comment