సింగరేణి బొగ్గు నిల్వల వివాదం: తవ్వినకొద్దీ పెరుగుతున్న అనుమానాలు
సింగరేణి బొగ్గు నిల్వల వివాదం: తవ్వినకొద్దీ పెరుగుతున్న అనుమానాలు
గోదావరిఖని, జూన్ 21: సింగరేణి కాలరీస్‌లో బొగ్గు నిల్వల వ్యవహారం రోజురోజుకు వివాదాస్పదంగా మారుతోంది. రాజకీయ పార్టీలు రూ.1,600 కోట్ల కుంభకోణం జరిగిందని ఆరోపిస్తున్న నేపథ్యంలో, సింగరేణి యాజమాన్యం వెల్లడిస్తున్న గణాంకాల్లోనూ స్పష్టత లేకపోవడం అనుమానాలకు తావిస్తోంది.
2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి సింగరేణి ప్రకటించిన అధికారిక లెక్కల ప్రకారం 69.01 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి కాగా, 65.27 మిలియన్ టన్నుల బొగ్గు మాత్రమే రవాణా చేసి విక్రయించినట్లు తెలిపింది. దీంతో 3.74 మిలియన్ టన్నుల బొగ్గు వ్యత్యాసం కనిపిస్తోంది. సాధారణంగా ప్రతి ఏడాది 1 నుంచి 2 లక్షల టన్నుల వరకు తేడా ఉండటం సహజమే అయినప్పటికీ, ఈసారి దాదాపు 37.4 లక్షల టన్నుల వ్యత్యాసం నమోదవడం సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా పేర్కొంటున్నారు.
ఈ అంశంపై యాజమాన్యం తమ వద్ద ప్రస్తుతం 26.77 లక్షల టన్నుల బొగ్గు నిల్వలు ఉన్నాయని మాత్రమే చెబుతోంది. అయితే 4 మిలియన్ టన్నుల బొగ్గు మాయం ఆరోపణలపై స్పష్టమైన వివరణ ఇవ్వకపోవడం విమర్శలకు దారితీస్తోంది. ఈ వ్యత్యాసాన్ని 2025-26 ఆర్థిక సంవత్సరపు ఉత్పత్తి గణాంకాల్లో సర్దుబాటు చేసే ప్రయత్నం జరుగుతోందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ఇంకా 2024-25 ఆర్థిక ఫలితాలను సింగరేణి ప్రకటించకపోవడం కూడా సందేహాలను మరింత పెంచుతోంది. ఏప్రిల్‌లో జరగాల్సిన తనిఖీలు ఆలస్యమవడం, కేంద్ర బృందాల సందర్శనలో జాప్యం చోటుచేసుకోవడం, కేంద్ర మంత్రి ముఖ్యమంత్రికి లేఖ రాయడం వంటి పరిణామాలు వివాదానికి మరింత ఊతమిస్తున్నాయి. అలాగే బొగ్గు నిల్వలపై కాగ్ (CAG) భౌతిక పరిశీలన జరగకపోవడం కూడా చర్చనీయాంశమైంది.
నిపుణుల అభిప్రాయం ప్రకారం, ఆరోపణల నిజానిజాలు తేలాలంటే స్వతంత్ర ఫోరెన్సిక్ ఆడిట్‌తో పాటు కాగ్ ద్వారా ఫిజికల్ వెరిఫికేషన్ నిర్వహించాల్సిన అవసరం ఉంది. అప్పటి వరకు 4 మిలియన్ టన్నుల బొగ్గు మాయం ఆరోపణలపై సందేహాలు కొనసాగుతాయని భావిస్తున్నారు.
ఇటీవల శ్రీరాంపూర్ ఓపెన్‌కాస్ట్‌లో నిర్వహించిన ఓపెన్ హౌస్ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో పాటు పలువురు మంత్రులు పాల్గొని, సింగరేణిలో ఎలాంటి బొగ్గు మాయం జరగలేదని, వ్యవహారం పూర్తిగా పారదర్శకంగా ఉందని పేర్కొన్నారు. అయితే ఈ అంశంపై రాష్ట్ర ప్రభుత్వం అధికారిక విచారణకు ఆదేశించకపోవడం గమనార్హం.
గుర్తింపు సంఘం ఎన్నికల ప్రభావమా?
సింగరేణిలో త్వరలో జరగనున్న గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికల నేపథ్యంలో ఈ అంశం రాజకీయ ప్రాధాన్యం సంతరించుకున్నట్లు కనిపిస్తోంది. షెడ్యూల్ ప్రకారం 2026 సెప్టెంబర్‌లో గుర్తింపు సంఘం ఎన్నికలు జరగాల్సి ఉంది. ఈ నేపథ్యంలో బొగ్గు ఉత్పత్తి, విద్యుత్ ఉత్పత్తి, కారుణ్య నియామకాలు వంటి అంశాలపై రాజకీయ పార్టీలు ప్రత్యేక దృష్టి సారిస్తున్నాయి.
సీబీఐ విచారణకు డిమాండ్
ఈ వ్యవహారంపై బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి స్పందిస్తూ, సింగరేణిలో గత 12 ఏళ్లుగా జరిగినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న అవకతవకలపై సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.
రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాస్తే కేంద్ర ప్రభుత్వం సీబీఐ దర్యాప్తుకు సిద్ధంగా ఉందని ఆయన పేర్కొన్నారు. సింగరేణి పర్యటనకు అనుమతి కోరినా చివరి నిమిషంలో నిరాకరించారని ఆరోపించారు. బొగ్గు నిల్వలతో పాటు సోలార్ ప్రాజెక్టుల్లోనూ అక్రమాలు జరిగాయని, డీజిల్, జెలిటిన్ వంటి సామగ్రిని మార్కెట్ ధర కంటే అధిక ధరలకు మధ్యవర్తుల ద్వారా కొనుగోలు చేసి సంస్థకు నష్టం కలిగిస్తున్నారని ఆరోపించారు.
సింగరేణి బొగ్గు నిల్వల వివాదం రాజకీయంగా మరింత వేడెక్కుతున్న నేపథ్యంలో, ఆరోపణలపై సమగ్ర విచారణ జరిగితేనే వాస్తవాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.

Post a Comment