-->

టాలీవుడ్‌లో విషాదం.. సీనియర్ నటి పావలా శ్యామల కన్నుమూత

టాలీవుడ్‌లో విషాదం.. సీనియర్ నటి పావలా శ్యామల కన్నుమూత
టాలీవుడ్‌లో విషాదం.. సీనియర్ నటి పావలా శ్యామల కన్నుమూత

తెలుగు సినీ పరిశ్రమలో తనదైన నటనతో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న ప్రముఖ క్యారెక్టర్ ఆర్టిస్ట్, సీనియర్ నటి పావలా శ్యామల కన్నుమూశారు. గత కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె హైదరాబాద్‌లోని ఉస్మానియా జనరల్ హాస్పిటల్లో చికిత్స పొందుతూ సోమవారం అర్ధరాత్రి అనంతరం తుదిశ్వాస విడిచారు. రాత్రి 1:52 గంటలకు తీవ్ర గుండెపోటుతో ఆమె మరణించినట్లు వైద్యులు అధికారికంగా ప్రకటించారు. ప్రస్తుతం ఆమె భౌతికకాయాన్ని ఆసుపత్రి మార్చురీలో భద్రపరిచారు.

పావలా శ్యామల మరణ వార్తతో తెలుగు సినీ పరిశ్రమలో విషాద ఛాయలు అలుముకున్నాయి. దశాబ్దాల పాటు వందలాది చిత్రాల్లో విభిన్న పాత్రలు పోషించి ప్రేక్షకుల మన్ననలు పొందిన ఆమె, జీవిత చరమాంకంలో తీవ్ర అనారోగ్యం, ఆర్థిక ఇబ్బందులతో పోరాడాల్సి రావడం సినీ వర్గాలను కలచివేస్తోంది. ఆమెతో పాటు కుమార్తె మాధవి కూడా అనారోగ్యంతో బాధపడుతుండటంతో కుటుంబ పరిస్థితి మరింత దయనీయంగా మారింది.

వైద్యుల సమాచారం ప్రకారం పావలా శ్యామల హైబీపీ, కరోనా ఆర్టరీ డిసీజ్ (CAD), పార్కిన్సన్స్ వ్యాధి, గుండె సంబంధిత సమస్యలతో చాలాకాలంగా బాధపడుతున్నారు. మూడు నెలల క్రితం ఆమెను, కుమార్తె మాధవిని హైదరాబాద్‌లోని గవర్నమెంట్ చెస్ట్ హాస్పిటల్ ఆవరణలో గుర్తుతెలియని వ్యక్తులు వదిలివెళ్లినట్లు సమాచారం. వారిని గమనించిన ఆస్పత్రి సిబ్బంది వెంటనే అధికారులకు సమాచారం అందించగా, చికిత్స నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.

అయితే ఉస్మానియా ఆసుపత్రిలో ఉండలేమని చెప్పడంతో వారు తిరిగి ఎర్రగడ్డ ఛాతీ ఆసుపత్రికి వెళ్లారు. అనంతరం బోరబండ పోలీస్ స్టేషన్ పోలీసుల సహకారంతో నగరంలోని ఓ అనాథాశ్రమానికి తరలించారు. ఆరోగ్య పరిస్థితి మరింత విషమించడంతో గత వారం మళ్లీ ఉస్మానియా ఆసుపత్రిలో చేర్పించగా, చికిత్స పొందుతూ ఆమె కన్నుమూశారు. ఇదే సమయంలో కుమార్తె మాధవి కూడా ఉస్మానియా ఆసుపత్రిలో ఇన్‌పేషంట్‌గా చికిత్స పొందుతున్నట్లు సమాచారం.

సినీ పరిశ్రమలో ఎన్నో గుర్తుండిపోయే పాత్రలతో ప్రేక్షకుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిన పావలా శ్యామల చివరి రోజుల్లో ఇలాంటి పరిస్థితులను ఎదుర్కోవడం పట్ల పలువురు సినీ ప్రముఖులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆమె మరణంపై నటీనటులు, దర్శకులు, అభిమానులు సోషల్ మీడియా వేదికగా సంతాపం తెలుపుతూ, ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నారు.

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793