ఘోర విషాదం.. ఆగి ఉన్న బొలెరోను ఢీకొట్టిన లారీ.. ముగ్గురు దుర్మరణం
దైవదర్శనానికి వెళ్తుండగా ఘోర విషాదం.. ఆగి ఉన్న బొలెరోను ఢీకొట్టిన లారీ.. ముగ్గురు దుర్మరణం
విజయనగరం, జూలై 28: ఆంధ్రప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. దైవదర్శనానికి వెళ్తున్న భక్తుల ప్రయాణం విషాదంగా మారింది. విజయనగరం మండలం చెల్లూరు జాతీయ రహదారిపై సోమవారం అర్ధరాత్రి జరిగిన ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందగా, మరో 13 మంది తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.
పోలీసుల వివరాల ప్రకారం.. విశాఖపట్టణం జిల్లా పద్మనాభం మండలం బొచ్చపేట, డెంకాడ మండలం బొడ్డవలస, విజయనగరం మండలం చెల్లూరుకు చెందిన మూడు కుటుంబాల 16 మంది రాయగడలో దైవదర్శనానికి వెళ్లేందుకు బొలెరో వాహనాన్ని అద్దెకు తీసుకున్నారు. బొచ్చపేట నుంచి బయలుదేరిన వాహనం అయినాడ కూడలి వద్ద బొడ్డవలసకు చెందిన మరికొందరిని ఎక్కించుకుని ప్రయాణం కొనసాగించింది.
చెల్లూరు సమీపంలోని జాతీయ రహదారిపై కొద్దిసేపు వాహనాన్ని రోడ్డు పక్కన ఆపిన సమయంలో, విశాఖపట్టణం వైపు నుంచి అతివేగంగా వచ్చిన లారీ వెనుక నుంచి బొలెరోను బలంగా ఢీకొట్టింది. ఢీకొన్న వేగానికి బొలెరో కొద్దిదూరం వరకు లారీతో పాటు ఈడ్చుకెళ్లడంతో వాహనం పూర్తిగా ధ్వంసమైంది.
ఈ దారుణ ప్రమాదంలో చింతపల్లి రాంబాబు అలియాస్ రామునాయుడు (50), మజ్జి నారాయణరావు (50), బి. మోహననాయుడు (8) అక్కడికక్కడే మృతి చెందారు. మరో 13 మంది తీవ్రంగా గాయపడగా, వారిని స్థానికులు, పోలీసులు వెంటనే సమీప ఆస్పత్రులకు తరలించారు. గాయపడిన వారిలో ఇద్దరి పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లు సమాచారం.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాదానికి గల కారణాలపై విచారణ ప్రారంభించి కేసు నమోదు చేశారు.
దైవదర్శనం కోసం ఆనందంగా బయలుదేరిన మూడు కుటుంబాల్లో ముగ్గురు ప్రాణాలు కోల్పోవడంతో ఆయా గ్రామాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. కుటుంబ సభ్యుల రోదనలు హృదయాలను కలచివేస్తున్నాయి. పోలీసులు లారీ డ్రైవర్ నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణమా అనే కోణంలో దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

Post a Comment