బుల్లెట్ ట్రైన్ మాకొద్దు.. బహదూర్‌గూడలో రైతుల ఆందోళన తీవ్రం
బుల్లెట్ ట్రైన్ మాకొద్దు.. బహదూర్‌గూడలో రైతుల ఆందోళన తీవ్రం
రంగారెడ్డి జిల్లా, జులై 18: రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం బహదూర్‌గూడ గ్రామంలో బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు భూసేకరణ అంశం ఉద్రిక్తతకు దారితీసింది. ప్రాజెక్టు కోసం సేకరించిన భూములకు కంచె వేయడానికి శనివారం రెవెన్యూ, హైడ్రా అధికారులు వెళ్లగా, స్థానిక రైతులు అడ్డుకుని నిరసన వ్యక్తం చేశారు. దీంతో గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు కోసం తమ వ్యవసాయ భూములను అప్పగించేందుకు రైతులు నిరాకరిస్తున్నారు. గత ఎనిమిది రోజులుగా వారు నిరసన కార్యక్రమాలు కొనసాగిస్తూ, ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీతో పాటు మార్కెట్ విలువకు అనుగుణంగా తగిన పరిహారం ప్రకటించిన తర్వాతే భూములు ఇస్తామని డిమాండ్ చేస్తున్నారు.
ఈ నేపథ్యంలో అధికారులు భూముల వద్ద కంచె ఏర్పాటు చేసేందుకు రావడంతో రైతులు తీవ్రంగా వ్యతిరేకించారు. ఈ సందర్భంగా పోలీసులకు, రైతులకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుని కొంతసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
ఆందోళన సమయంలో ఓ రైతు అస్వస్థతకు గురై స్పృహ తప్పి పడిపోవడంతో అతడిని ఆస్పత్రికి తరలించే ప్రయత్నం చేశారు. అయితే, తమకు న్యాయం జరిగే వరకు ఎలాంటి పనులు చేపట్టవద్దంటూ తోటి రైతులు అడ్డుకున్నారు.
"మా డిమాండ్లు నెరవేర్చిన తర్వాతే మా పొలాల్లో కంచె వేయాలి. ప్రభుత్వం స్పష్టమైన హామీ ఇచ్చే వరకు వెనక్కి తగ్గేది లేదు" అని రైతులు స్పష్టం చేశారు.
పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో గ్రామంలో భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. అధికారులు రైతులతో చర్చలు జరిపి సమస్యకు పరిష్కారం కనుగొనే ప్రయత్నం చేస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం బహదూర్‌గూడలో పరిస్థితిని అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు.

Post a Comment