గిరిజన మహిళలపై అటవీశాఖ అధికారుల దాడి ఆరోపణలు.. కొత్తగూడెంలో ఉద్రిక్తత
గిరిజన మహిళలపై అటవీశాఖ అధికారుల దాడి ఆరోపణలు.. కొత్తగూడెంలో ఉద్రిక్తత
భద్రాద్రి కొత్తగూడెం, జూలై 18: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పోడు భూముల వివాదం మరోసారి ఉద్రిక్తతకు దారితీసింది. అశ్వాపురం మండలం మానుబోతులగూడెంలో పోడు భూముల వద్ద అటవీశాఖ అధికారులు, గిరిజనుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఈ ఘటనలో ముగ్గురు గిరిజన మహిళలు గాయపడినట్లు గ్రామస్తులు ఆరోపిస్తున్నారు.
స్థానికుల కథనం ప్రకారం, మానుబోతులగూడెం మారుమూల గిరిజన గ్రామం. సుమారు 30 ఏళ్లుగా వలస గిరిజనులు అక్కడ పోడు భూములను సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. అయితే వర్షాకాలం ప్రారంభం కావడంతో ప్రతి ఏడాది మాదిరిగానే పోడు భూముల సాగుపై అటవీశాఖ, గిరిజనుల మధ్య వివాదాలు తలెత్తుతున్నాయని వారు చెబుతున్నారు.
శనివారం మణుగూరు ఫారెస్ట్ రేంజర్ ఉపేందర్ నేతృత్వంలో సుమారు 40 మంది అటవీశాఖ సిబ్బంది పొలాల వద్దకు చేరుకున్నారని, మొదట వాగ్వాదం జరిగి అనంతరం తోపులాటకు దారితీసిందని గ్రామస్తులు ఆరోపించారు. ఈ సందర్భంగా మహిళలను సైతం తోసిపుచ్చడంతో ముగ్గురు గిరిజన మహిళలు గాయపడ్డారని తెలిపారు.
గాయపడిన మహిళలను మణుగూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు సమాచారం.
కాగా, మానుబోతులగూడెం గ్రామానికి సరైన రహదారి, మొబైల్ సిగ్నల్ వంటి మౌలిక సదుపాయాలు లేకపోవడంతో ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చినట్లు తెలుస్తోంది.
అయితే ఈ ఘటనపై అటవీశాఖ అధికారుల అధికారిక వివరణ ఇంకా వెలువడాల్సి ఉంది. గ్రామస్తులు చేసిన ఆరోపణలపై అధికారుల స్పందన కోసం ఎదురుచూస్తున్నారు.

Post a Comment