-->

వేములవాడ-కరీంనగర్ రహదారిపై ఘోర ప్రమాదం.. నలుగురు మృతి, పలువురికి తీవ్ర గాయాలు

 

వేములవాడ-కరీంనగర్ రహదారిపై ఘోర ప్రమాదం.. నలుగురు మృతి, పలువురికి తీవ్ర గాయాలు

వేములవాడ-కరీంనగర్ రహదారిపై ఘోర ప్రమాదం.. నలుగురు మృతి, పలువురికి తీవ్ర గాయాలు

రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడ-కరీంనగర్ ప్రధాన రహదారిపై గురువారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. అనుపురం ఆర్అండ్ఆర్ కాలనీ (ఇస్లాం నగర్) సమీపంలో జరిగిన ఈ ప్రమాదంలో నలుగురు కూలీలు అక్కడికక్కడే మృతి చెందగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారు.

ప్రాథమిక సమాచారం ప్రకారం, వేములవాడ వైపు నుంచి కొదురుపాక దిశగా బీహార్‌కు చెందిన వలస కూలీలతో వెళ్తున్న టాటా ఎస్ వాహనాన్ని సిరిసిల్ల నుంచి కరీంనగర్ వైపు వెళ్తున్న ఆర్టీసీ నాన్‌స్టాప్ బస్సు వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది. ఢీకొన్న వేగానికి టాటా ఎస్ వాహనం అదుపు తప్పి బోల్తా పడింది.

ఈ ప్రమాదంలో వాహనంలో ప్రయాణిస్తున్న నలుగురు కూలీలు అక్కడికక్కడే మృతి చెందగా, మరికొందరు తీవ్ర గాయాలపాలయ్యారు. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించి సహాయక చర్యలు చేపట్టారు.

సమాచారం అందుకున్న పోలీసులు, అత్యవసర సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని క్షతగాత్రులను వేములవాడ ఏరియా ఆసుపత్రికి తరలించారు. కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. దీంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది.

ప్రమాదానికి గల ఖచ్చితమైన కారణాలపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. మృతుల వివరాలు, గాయపడిన వారి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఈ విషాద ఘటనతో ఆ ప్రాంతంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793