-->

భూమి కోసం అత్తను హత్య చేసిన కోడలు.. ప్రమాద మరణంగా చిత్రీకరించే ప్రయత్నం, అరెస్ట్

భూమి కోసం అత్తను హత్య చేసిన కోడలు.. ప్రమాద మరణంగా చిత్రీకరించే ప్రయత్నం, అరెస్ట్

 
భూమి కోసం అత్తను హత్య చేసిన కోడలు.. ప్రమాద మరణంగా చిత్రీకరించే ప్రయత్నం, అరెస్ట్

సూర్యాపేట: సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలం తూర్పుగూడెంలో ఏప్రిల్ నెలలో చోటుచేసుకున్న వృద్ధురాలి అనుమానాస్పద మృతి కేసును పోలీసులు ఛేదించారు. భూమి వివాదమే హత్యకు కారణమని, అత్తను హత్య చేసి మంచంపై నుంచి పడిపోవడంతో చనిపోయిందని నమ్మించే ప్రయత్నం చేసిన కోడలిని పోలీసులు అరెస్ట్ చేశారు.

సూర్యాపేట డీఎస్పీ ప్రసన్నకుమార్ గురువారం కేసు వివరాలను వెల్లడించారు. గ్రామానికి చెందిన కొణతం భాగ్యమ్మకు సుమారు ఆరు ఎకరాల భూమి ఉంది. ఆమె కుమారుడు మృతి చెందడంతో కోడలు మధురతో కలిసి నివసిస్తోంది. ఇదిలా ఉండగా, భూమిలో తనకు కూడా వాటా ఇవ్వాలని భాగ్యమ్మ కుమార్తె శోభారాణి తుంగతుర్తి కోర్టును ఆశ్రయించింది.

ఈ నేపథ్యంలో శోభారాణికి రెండు ఎకరాల భూమిని ఇవ్వాలని ఏప్రిల్ 27న భాగ్యమ్మ నిర్ణయించిందని పోలీసులు తెలిపారు. దీంతో భూమి తన చేతిలో నుంచి పోతుందనే ఆగ్రహంతో కోడలు మధుర అత్తను హత్య చేయాలని పథకం వేసినట్లు విచారణలో తేలిందన్నారు.

పోలీసుల కథనం ప్రకారం, భాగ్యమ్మను బలంగా తోసేయడంతో ఆమె కిందపడిపోయి తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతి చెందింది. అనంతరం మంచంపై నుంచి ప్రమాదవశాత్తు పడిపోవడంతో మరణించిందని కుటుంబ సభ్యులను, స్థానికులను నమ్మించే ప్రయత్నం చేసింది.

ఏప్రిల్ 28న అంత్యక్రియల సమయంలో భాగ్యమ్మ శరీరంపై అనుమానాస్పద గాయాలను గమనించిన కుమార్తె శోభారాణి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టారు.

విచారణలో కోడలు మధురే హత్య చేసినట్లు నిర్ధారణ కావడంతో ఆమెను అరెస్ట్ చేసి న్యాయస్థానం ఎదుట హాజరుపరచగా రిమాండ్‌కు తరలించినట్లు డీఎస్పీ ప్రసన్నకుమార్ తెలిపారు. భూమి వివాదాల నేపథ్యంలో ఈ ఘటన చోటుచేసుకోవడం స్థానికంగా సంచలనం సృష్టించింది.

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793