మూసీలో దూకి మహిళ ఆత్మహత్య.. కాపాడేందుకు భర్త ప్రయత్నించినా ఫలితం లేకపోయింది
మూసీలో దూకి మహిళ ఆత్మహత్య.. కాపాడేందుకు భర్త ప్రయత్నించినా ఫలితం లేకపోయింది
రాజేంద్రనగర్: రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం విషాద ఘటన చోటుచేసుకుంది. మూసి కాలువలోకి దూకిన ఓ మహిళ చికిత్స పొందుతూ మృతి చెందింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గుర్మిటికల్ ప్రాంతానికి చెందిన భాగ్యమ్మ (34), రాజు దంపతులు బతుకుదెరువు కోసం నగరానికి వలస వచ్చి జనచైతన్య ఫేజ్-1లో నివాసం ఉంటున్నారు. భాగ్యమ్మ స్థానికంగా పని చేస్తుండగా, భర్త రాజు లేబర్‌గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు.
గత కొంతకాలంగా భాగ్యమ్మ అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ నేపథ్యంలో శనివారం ఉదయం ఇంటికి సమీపంలోని మూసి కాలువలోకి ఆమె దూకింది. ఇది గమనించిన భర్త రాజు వెంటనే కాలువలోకి దూకి ఆమెను బయటకు తీసుకొచ్చాడు. అనంతరం స్థానికుల సహాయంతో సమీపంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా, అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.
సమాచారం అందుకున్న రాజేంద్రనగర్ పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని పంచనామా నిర్వహించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
గమనిక: మీరు లేదా మీకు తెలిసిన ఎవరైనా ఆత్మహత్య ఆలోచనలతో బాధపడుతున్నట్లయితే, కుటుంబ సభ్యులు, స్నేహితులు లేదా మానసిక ఆరోగ్య నిపుణులను వెంటనే సంప్రదించడం చాలా ముఖ్యం. సహాయం అందుబాటులో ఉంటుంది.

Post a Comment