భార్యను హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించిన భర్త..
భార్యను హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించిన భర్త.. బాచుపల్లిలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన
హైదరాబాద్ బాచుపల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో భార్యను హత్య చేసి, దానిని ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు ప్రయత్నించిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసుల దర్యాప్తులో అసలు నిజం బయటపడటంతో నిందితుడిని అరెస్టు చేశారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన బాలకృష్ణ తరచూ మద్యం సేవించి ఇంటికి వచ్చి భార్య భార్గవి (35)తో గొడవపడేవాడు. ఈ క్రమంలో గత నెల 20వ తేదీన కూడా ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది.
ఆగ్రహానికి లోనైన బాలకృష్ణ భార్య భార్గవి గొంతు నులిమి, అనంతరం ఆమె తలను గోడకు బలంగా కొట్టి హత్య చేశాడు. నేరాన్ని దాచిపెట్టేందుకు భార్య మృతదేహాన్ని చీరతో ఫ్యాన్‌కు వేలాడదీసి ఆత్మహత్య చేసుకున్నట్లు నమ్మించే ప్రయత్నం చేశాడు.
మొదట అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసిన బాచుపల్లి పోలీసులు ఘటనపై లోతుగా విచారణ చేపట్టారు. దర్యాప్తులో బాలకృష్ణ ప్రవర్తనపై అనుమానం రావడంతో విచారించగా, అతడు నేరాన్ని అంగీకరించాడు.
దీంతో పోలీసులు అనుమానాస్పద మృతి కేసును హత్య కేసుగా మార్చి, నిందితుడు బాలకృష్ణను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలపై పోలీసులు మరింత దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

Post a Comment