-->

బీఫ్ దుకాణాల వివాదం.. జోగిపేటలో ఉద్రిక్తత – ఆసుపత్రిలోనూ దాడి, పలువురికి గాయాలు

 

బీఫ్ దుకాణాల వివాదం.. జోగిపేటలో ఉద్రిక్తత – ఆసుపత్రిలోనూ దాడి, పలువురికి గాయాలు

బీఫ్ దుకాణాల వివాదం.. జోగిపేటలో ఉద్రిక్తత – ఆసుపత్రిలోనూ దాడి, పలువురికి గాయాలు

సంగారెడ్డి జిల్లా, జోగిపేట: జోగిపేట పట్టణంలో బీఫ్, మటన్ దుకాణాల ఏర్పాటు అంశం ఉద్రిక్తతకు దారితీసింది. దుకాణాల ఏర్పాటు, వ్యాపార ఆధిపత్యంపై అందోల్ ప్రాంతానికి చెందిన కటికే ముస్లింలు, జోగిపేటకు చెందిన ముస్లింల మధ్య కొంతకాలంగా కొనసాగుతున్న విభేదాలు శనివారం ఘర్షణగా మారాయి.

ప్రారంభంలో ఇరువర్గాల మధ్య వాగ్వాదం చోటుచేసుకోగా, పరిస్థితి ఒక్కసారిగా అదుపుతప్పింది. పరస్పరం కత్తులు, కర్రలతో దాడులు చేసుకోవడంతో జోగిపేటకు చెందిన పలువురు యువకులు, వ్యాపారులు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు వెంటనే క్షతగాత్రులను జోగిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

అయితే ఘటన అక్కడితో ముగియలేదు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులపై కక్షతో కొందరు వ్యక్తులు ఆసుపత్రి ప్రాంగణంలోకి చొరబడి మరోసారి దాడికి పాల్పడినట్లు సమాచారం. బాధితులతో పాటు వారికి అండగా ఉన్నవారిపైనా దాడి జరగడంతో ఆసుపత్రి ప్రాంగణం ఉద్రిక్తంగా మారింది. ఈ ఘటనతో రోగులు, వారి బంధువులు, ఆసుపత్రి సిబ్బంది తీవ్ర భయాందోళనకు గురయ్యారు.

సమాచారం అందుకున్న జోగిపేట పోలీసులు భారీ బలగాలతో సంఘటనా స్థలానికి చేరుకుని ఇరువర్గాలను చెదరగొట్టి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. ఘర్షణ మరింత విస్తరించకుండా చర్యలు చేపట్టారు. అనంతరం పట్టణంలోని సున్నిత ప్రాంతాల్లో అదనపు పోలీసు బలగాలను మోహరించి భద్రతను కట్టుదిట్టం చేశారు.

ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఘర్షణకు కారణమైన వారిని గుర్తించి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు. ప్రస్తుతం జోగిపేటలో పరిస్థితి పోలీసుల పర్యవేక్షణలో ప్రశాంతంగా ఉన్నప్పటికీ, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు.

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793