డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల్లో అక్రమాలు.. ముగ్గురు ట్రాఫిక్ పోలీసులపై సస్పెన్షన్
డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల్లో అక్రమాలు.. ముగ్గురు ట్రాఫిక్ పోలీసులపై సస్పెన్షన్
కరీంనగర్, జూలై 28: కరీంనగర్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలో డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల నిర్వహణలో తీవ్ర అక్రమాలు వెలుగుచూడడంతో ముగ్గురు పోలీసు సిబ్బందిపై సస్పెన్షన్ వేటు పడింది. డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో పట్టుబడిన వ్యక్తుల నుంచి భారీ మొత్తంలో డబ్బులు వసూలు చేసి, వారికి బదులుగా ఇతరులను కోర్టులో హాజరుపరిచినట్లు ఆరోపణలు రావడంతో ఉన్నతాధికారులు చర్యలు చేపట్టారు.
ఈ ఘటనలో ఆర్‌ఎస్‌ఐ శనిగల శ్రీకాంత్, కోర్టు డిస్పోజల్ కానిస్టేబుల్ సాయి, ట్రాఫిక్ స్టేషన్ రైటర్ కిరణ్‌లను కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం సస్పెండ్ చేశారు.
ప్రాథమిక సమాచారం ప్రకారం, సుమారు 130 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల్లో రూ.20 లక్షల వరకు అక్రమంగా వసూలు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. అంతేకాకుండా, అసలు నిందితుల స్థానంలో ఇతర వ్యక్తులను కోర్టులో హాజరుపరిచి న్యాయస్థానాన్ని తప్పుదారి పట్టించినట్లు కూడా విచారణలో తేలినట్లు సమాచారం.
ఈ వ్యవహారాన్ని ఉన్నతాధికారులు అత్యంత తీవ్రంగా పరిగణించి ప్రాథమిక విచారణ చేపట్టారు. విచారణలో ప్రాథమికంగా ఆరోపణలకు ఆధారాలు లభించడంతో సంబంధిత ముగ్గురు పోలీసు సిబ్బందిని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
ప్రస్తుతం ఈ ఘటనపై శాఖాపరమైన విచారణ కొనసాగుతోంది. పూర్తి స్థాయి దర్యాప్తు అనంతరం మరిన్ని వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని పోలీసు వర్గాలు తెలిపాయి.

Post a Comment