రూ.2.50 లక్షల విలువైన అక్రమ బెల్లం స్వాధీనం.. ఇద్దరిపై కేసు నమోదు
రూ.2.50 లక్షల విలువైన అక్రమ బెల్లం స్వాధీనం.. ఇద్దరిపై కేసు నమోదు
హైదరాబాద్, ఆగస్టు 3: హైదరాబాద్ నుంచి దేవరకొండ ప్రాంతానికి అక్రమంగా తరలిస్తున్న బెల్లం, ఆలంను ఎక్సైజ్ స్పెషల్ టాస్క్ ఫోర్స్ (ఎస్‌టీఎఫ్) బీ టీం అధికారులు పట్టుకున్నారు. ఈ ఘటనలో వాహనాన్ని స్వాధీనం చేసుకుని ఇద్దరు నిందితులపై కేసు నమోదు చేశారు.
ఎస్టీఎఫ్ బీ టీం ఎస్‌ఐ బాలరాజు ఆధ్వర్యంలో నిర్వహించిన తనిఖీల్లో, నాటు సారా తయారీ కోసం వ్యాన్లో తరలిస్తున్న 2,250 కిలోల బెల్లం మరియు 250 కిలోల ఆలం స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న బెల్లం, ఆలం మొత్తం విలువ సుమారు రూ.2.50 లక్షలు ఉంటుందని అధికారులు తెలిపారు.
ఈ కేసులో దేవరకొండ ప్రాంతానికి చెందిన ఆంగోతు తరుణ్, పత్లావత్ లాల్ కృష్ణలను నిందితులుగా గుర్తించారు. గతంలో కూడా అక్రమ బెల్లం రవాణా కేసుల్లో వీరిపై పలు కేసులు నమోదై, జరిమానాలు విధించినట్లు అధికారులు వెల్లడించారు.
స్వాధీనం చేసుకున్న సరుకును అధికారులు సీజ్ చేసి, నిందితులపై చట్టపరమైన చర్యలు ప్రారంభించారు. అక్రమంగా నాటు సారా తయారీకి ఉపయోగించే ముడి పదార్థాల రవాణాపై ప్రత్యేక నిఘా కొనసాగుతుందని ఎక్సైజ్ అధికారులు హెచ్చరించారు.

Post a Comment