కొండమల్లేపల్లిలో దారుణ హత్య.. పాఠశాల ప్రిన్సిపాల్‌పై 27 కత్తిపోట్లు
కొండమల్లేపల్లిలో దారుణ హత్య.. పాఠశాల ప్రిన్సిపాల్‌పై 27 కత్తిపోట్లు
నల్గొండ జిల్లా కొండమల్లేపల్లి మండల కేంద్రంలోని జేబీ కాలనీలో దారుణ హత్య చోటుచేసుకుంది. నాగార్జున గ్రామర్ ఇంగ్లిష్ మీడియం పాఠశాల ప్రిన్సిపాల్, డైరెక్టర్ కల్లు రూపారెడ్డి (48) గుర్తుతెలియని వ్యక్తుల చేతిలో హత్యకు గురయ్యారు. బుధవారం ఉదయం ఈ ఘటన వెలుగులోకి రావడంతో స్థానికంగా తీవ్ర కలకలం రేగింది.
మూడు రోజుల సెలవుల అనంతరం ఇంటికి వచ్చిన రూపారెడ్డి
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రూపారెడ్డి తన భర్త కల్లు రాజేందర్‌రెడ్డితో కలిసి జేబీ కాలనీలోని సొంత ఇంట్లో నివాసముంటున్నారు. వారి కుమారుడు అభినవ్‌రెడ్డి హైదరాబాద్‌లో ఇంజినీరింగ్ చదువుతున్నాడు. వరుసగా మూడు రోజుల సెలవులు రావడంతో రూపారెడ్డి, ఆమె భర్త కలిసి హైదరాబాద్‌కు వెళ్లారు.
అయితే భర్తకు హైదరాబాద్‌లో పని ఉండటంతో రూపారెడ్డి మంగళవారం ఉదయం ఒక్కరే కొండమల్లేపల్లికి తిరిగి వచ్చారు. అనంతరం పాఠశాలకు వెళ్లి విధులు నిర్వహించారు. సాయంత్రం స్నేహితులు వస్తున్నారని చెప్పి సుమారు 5.30 గంటల సమయంలో సమీపంలోని తన ఇంటికి వెళ్లినట్లు పోలీసులు తెలిపారు.
ఫోన్ స్విచ్చాఫ్ కావడంతో వెలుగులోకి ఘటన
బుధవారం ఉదయం భర్త రాజేందర్‌రెడ్డి రూపారెడ్డికి ఫోన్ చేయగా ఫోన్ స్విచ్చాఫ్ వచ్చింది. దీంతో ఇంట్లో అద్దెకు ఉంటున్న వారికి ఫోన్ చేసి ఆమెతో మాట్లాడించాలని కోరారు. వారు ఇంటి వద్దకు వెళ్లి పలుమార్లు తలుపు తట్టినా ఎలాంటి స్పందన రాకపోవడంతో రాజేందర్‌రెడ్డికి సమాచారం అందించారు.
దీంతో ఆందోళనకు గురైన రాజేందర్‌రెడ్డి.. ఇంటి పక్కనే నివాసముంటున్న చింతపల్లి ఎస్‌ఐ రామ్మూర్తికి ఫోన్ చేసి విషయం చెప్పారు. ఎస్‌ఐతో పాటు చుట్టుపక్కల వారు ఇంటికి వెళ్లి పరిశీలించగా రూపారెడ్డి రక్తపు మడుగులో పడి ఉండటాన్ని గుర్తించారు.
మృతదేహంపై 27 కత్తిపోట్లు
సమాచారం అందుకున్న దేవరకొండ డీఎస్పీ శ్రీనివాస్‌రావు, సీఐ నవీన్‌కుమార్, ఎస్‌ఐ అజ్మీర రమేశ్ డాగ్ స్క్వాడ్‌తో కలిసి సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. వైద్యుల ప్రాథమిక నిర్ధారణ ప్రకారం రూపారెడ్డి మృతదేహంపై సుమారు 27 కత్తిపోట్లు ఉన్నట్లు తెలిసింది.
దోపిడీ కోణం లేనట్టే..
ఇంట్లోని వస్తువులు, నగదు ఏవీ చోరీకి గురికాలేదని పోలీసులు తెలిపారు. దీంతో దోపిడీ కోసం జరిగిన హత్యగా భావించడం లేదని, రూపారెడ్డికి పరిచయమున్న వ్యక్తులే ఈ దారుణానికి పాల్పడి ఉండొచ్చన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
కుటుంబ కలహాలు, వ్యక్తిగత విభేదాలు లేదా మరేదైనా కారణం ఉందా అనే కోణంలోనూ దర్యాప్తు కొనసాగుతోంది. మృతురాలి కుమారుడు అభినవ్‌రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు డీఎస్పీ శ్రీనివాస్‌రావు తెలిపారు.
ఘటనాస్థలానికి భారీగా చేరుకున్న స్థానికులు
రూపారెడ్డి హత్య విషయం తెలియడంతో స్థానికులు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. ఆమె మృతదేహాన్ని చూసి కుటుంబ సభ్యులు, బంధువులు, స్థానికులు కన్నీరుమున్నీరయ్యారు. హత్యకు పాల్పడిన వారిని వెంటనే గుర్తించి కఠినంగా శిక్షించాలని వారు డిమాండ్ చేశారు.
రూపారెడ్డి హత్యకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే నేనావత్ బాలునాయక్ పోలీసులను కోరారు. ఆయన వెంట మార్కెట్ కమిటీ చైర్మన్ నాయినీ జమున మాధవరెడ్డి, ఎంఏ సీరాజ్ ఖాన్, ఉట్కూరి వేమన్‌రెడ్డి, ఎడుపుల గోవింద్, దొండేటి మల్లారెడ్డి, హరికృష్ణ, కోట్ల జగదీశ్, శ్రీధర్‌గౌడ్ తదితరులు ఉన్నారు.
రూపారెడ్డి హత్యకు అసలు కారణం ఏమిటి? హత్యకు పాల్పడింది ఎవరు? అనే విషయాలపై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.

Post a Comment