విధి నిర్వహణలో మృతి చెందిన కానిస్టేబుల్ కుటుంబానికి రూ.కోటి బీమా చెక్కు అందజేసిన డీజీపీ సి.వి. ఆనంద్
విధి నిర్వహణలో మృతి చెందిన కానిస్టేబుల్ కుటుంబానికి రూ.కోటి బీమా చెక్కు అందజేసిన డీజీపీ సి.వి. ఆనంద్
విధి నిర్వహణలో ఉండగా రోడ్డు ప్రమాదానికి గురై అనంతరం మృతి చెందిన రాచకొండ కమిషనరేట్ ఏఆర్ కానిస్టేబుల్ వి. చరణ్‌కుమార్ కుటుంబానికి రాష్ట్ర డీజీపీ సి.వి. ఆనంద్ రూ.1 కోటి విలువైన బీమా చెక్కును అందజేశారు.
మల్కాజిగిరి కమిషనరేట్‌కు చెందిన 2018 బ్యాచ్ కానిస్టేబుల్ చరణ్‌కుమార్ ప్రస్తుతం ఈగల్ ఫోర్స్‌లో డిప్యూటేషన్‌పై విధులు నిర్వహిస్తున్నారు. 2025 సెప్టెంబర్ 22-23 అర్ధరాత్రి విధులు ముగించుకుని తిరిగి వస్తుండగా మహారాష్ట్రలోని దేవార్కర్ గ్రామం సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆయన తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రమాదంలో తలకు, కుడి కాలికి తీవ్ర గాయాలయ్యాయి.
ప్రమాదం అనంతరం స్థానికంగా ప్రథమ చికిత్స అందించి, మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌లోని యశోద ఆసుపత్రికి తరలించారు. అక్కడ ప్లాస్టిక్ సర్జరీతో పాటు ప్రత్యేక చికిత్స అందించారు. చికిత్స అనంతరం 2025 అక్టోబర్ 28న ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన చరణ్‌కుమార్ ఇంటికి చేరుకున్న కొద్దిసేపటికే అకస్మాత్తుగా కుప్పకూలిపోయారు. కుటుంబ సభ్యులు వెంటనే మళ్లీ ఆసుపత్రికి తరలించగా, అప్పటికే ఆయన మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.
మృతుడి కుటుంబానికి ఆర్థిక భరోసా కల్పించేందుకు ఈగల్ ఫోర్స్ డైరెక్టర్ సందీప్ షాండిల్య, ఎస్పీ రఘువీర్, అదనపు ఎస్పీ కృష్ణమూర్తి తదితర అధికారులు చొరవ తీసుకుని, ఎస్‌బీఐ బ్యాంకు అధికారులతో సమన్వయం చేసి బీమా క్లెయిమ్ ప్రక్రియను వేగంగా పూర్తి చేశారు.
ఈ సందర్భంగా డీజీపీ సి.వి. ఆనంద్ మృతుడి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. పోలీసు శాఖ ఎల్లప్పుడూ వారి కుటుంబానికి అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.

Post a Comment