ప్రతి మండలంలో నాణ్యమైన విద్యే లక్ష్యం.. ఎంఈఓలు సమర్థ నాయకత్వం వహించాలి: కలెక్టర్ కోయ శ్రీహర్ష
ప్రతి మండలంలో నాణ్యమైన విద్యే లక్ష్యం.. ఎంఈఓలు సమర్థ నాయకత్వం వహించాలి: కలెక్టర్ కోయ శ్రీహర్ష
పెద్దపల్లి, ఆగస్టు 4 : జిల్లాలో ప్రతి విద్యార్థికి నాణ్యమైన విద్య అందేలా మండల స్థాయిలో ఎంఈఓలు సమర్థ నాయకత్వం వహించాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆదేశించారు. వెనుకబడిన పాఠశాలలను గుర్తించి ప్రత్యేక కార్యాచరణతో విద్యా ప్రమాణాలను మెరుగుపరచాలని సూచించారు.
సోమవారం సమీకృత జిల్లా కలెక్టరేట్ (ఐడీఓసీ) సమావేశ మందిరంలో విద్యాశాఖ పనితీరుపై మండల విద్యాధికారులు (ఎంఈఓలు), కాంప్లెక్స్ హెడ్‌మాస్టర్లు, సంబంధిత అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో కలెక్టర్ పలు కీలక ఆదేశాలు జారీ చేశారు.
ప్రతి చిన్నారికి నాణ్యమైన విద్య అందించేందుకు ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాలను సమర్థవంతంగా క్షేత్రస్థాయిలో అమలు చేయాలని సూచించిన కలెక్టర్, ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమరసీ (FLN), ఎఫ్‌ఆర్‌ఎస్ కార్యక్రమాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని తెలిపారు. ఉపాధ్యాయులకు ఇచ్చిన శిక్షణ ఫలితాలు తరగతి గదిలో కనిపించేలా పర్యవేక్షణ ఉండాలని అన్నారు.
పాఠశాలల తనిఖీలను క్రమం తప్పకుండా నిర్వహించాలని, ప్రతి తనిఖీ వివరాలను నిర్దేశిత ఆన్‌లైన్ యాప్‌లో నమోదు చేయాలని ఆదేశించారు. తనిఖీ సమయంలో చెక్‌లిస్ట్‌ను తప్పనిసరిగా అనుసరించాలని, ఎంఈఓలు కనీసం 45 నిమిషాలు తరగతి గదిలో ఉండి బోధనా విధానం, విద్యార్థుల అభ్యాస స్థాయిని పరిశీలించి తమ సూచనలను యాప్‌లో నమోదు చేయాలని చెప్పారు.
అలాగే పాఠశాలల పరిశుభ్రత, పాఠ్యపుస్తకాలు, వర్క్‌బుక్స్, నోట్‌బుక్స్ అందుబాటులో ఉన్నాయా లేదా అనే అంశాలను పరిశీలించాలని సూచించారు. ఉపాధ్యాయుల బోధనా నైపుణ్యం, విద్యార్థుల ప్రాథమిక అభ్యాస సామర్థ్యాలను స్పాట్ అసెస్‌మెంట్ ద్వారా అంచనా వేసి అవసరమైన సూచనలు ఇవ్వాలని ఆదేశించారు.
ప్రాథమిక తరగతుల విద్యార్థుల్లో చదవడం, రాయడం నైపుణ్యాల పెంపుపై ప్రత్యేక దృష్టి సారించాలని, ప్రతి విద్యార్థి అభ్యాస సామర్థ్యాన్ని నిరంతరం అంచనా వేస్తూ అవసరమైన మెరుగుదల చర్యలు చేపట్టాలని కలెక్టర్ పేర్కొన్నారు.
సమావేశంలో పీఎం షేక్, మండల విద్యాధికారులు, కాంప్లెక్స్ హెడ్‌మాస్టర్లు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

Post a Comment