తెలంగాణలో వర్షాల బీభత్సం.. పలు జిల్లాలకు రెడ్ అలర్ట్
తెలంగాణలో వర్షాల బీభత్సం.. పలు జిల్లాలకు రెడ్ అలర్ట్
బుధ, గురువారాల్లో అత్యంత భారీ వర్షాలు.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక
హైదరాబాద్: బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం ప్రభావంతో తెలంగాణలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో బుధ, గురువారాల్లో భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో ఆయా జిల్లాలకు రెడ్, ఆరెంజ్, ఎల్లో అలర్ట్‌లు జారీ చేసింది.
బంగాళాఖాతంలోని తీవ్ర వాయుగుండంతో పాటు కర్ణాటక, కోస్తాంధ్ర మీదుగా ద్రోణి కొనసాగుతున్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఈ వ్యవస్థల ప్రభావంతో ఉత్తర తెలంగాణలోని పలు జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేశారు.
బుధవారం రెడ్ అలర్ట్
బుధవారం పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, కుమురం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, నల్గొండ, సూర్యాపేట, జనగామ, సిద్ధిపేట జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు.
ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించారు.
గురువారం కూడా భారీ వర్షాల హెచ్చరిక
గురువారం కుమురం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు.
ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, జనగామ, సిద్ధిపేట జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించారు.
25, 26 తేదీల్లోనూ వర్షాలు
ఈ నెల 25, 26 తేదీల్లోనూ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలతో పాటు ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది.
ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
భారీ వర్షాలు, ఈదురుగాలుల సమయంలో ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్లకపోవడం మంచిదని అధికారులు సూచించారు. చెట్ల కింద, విద్యుత్ స్తంభాల సమీపంలో, హోర్డింగ్‌ల కింద ఉండొద్దని హెచ్చరించారు. వర్షాల సమయంలో విద్యుత్ తీగలు, నీటితో నిండిన రహదారుల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
భారీ వర్షాల నేపథ్యంలో రాష్ట్ర అధికార యంత్రాంగం పూర్తిస్థాయిలో అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ అవసరమైన సహాయక చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించినట్లు సమాచారం.

Post a Comment