వైన్స్ హత్య కేసులో మరో ముగ్గురి అరెస్ట్
వైన్స్ హత్య కేసులో మరో ముగ్గురి అరెస్ట్
ప్రధాన సూత్రధారి ఉమామహేష్‌తో పాటు మరో ఇద్దరి పట్టివేత.. మొత్తం 11 మంది అరెస్ట్
హైదరాబాద్: బండ్లగూడ సుప్రీం వైన్స్‌లో రౌడీషీటర్ మహమ్మద్ నయీం హత్య కేసులో పరారీలో ఉన్న ప్రధాన సూత్రధారి సహా మరో ఇద్దరిని నాగోల్ పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. దీంతో ఈ కేసులో ఇప్పటివరకు అరెస్టైన నిందితుల సంఖ్య 11కు చేరింది.
అరెస్టైన వారిలో ఖమ్మంకు చెందిన కె.ఉమామహేష్ అలియాస్ జేకే మహేష్ (34), సాయినగర్‌కు చెందిన మహమ్మద్ మున్నా అలియాస్ బోలె (47), ఖమ్మం జిల్లా ప్రొద్దుటూరుకు చెందిన దుగ్గిరాల కార్తీక్ (29) ఉన్నారు. వీరిని ఎల్.బి.నగర్‌లో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ఈ నెల 14న బండ్లగూడ సుప్రీం వైన్స్‌లో నయీంపై కొందరు వ్యక్తులు వేటకొడవళ్లతో దాడి చేసి హత్య చేసిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు ఈ నెల 16న ఎనిమిది మంది నిందితులను అరెస్టు చేశారు. అయితే ప్రధాన సూత్రధారి ఉమామహేష్ అప్పటి నుంచి పోలీసులకు చిక్కకుండా పరారీలో ఉన్నాడు.
రియల్ ఎస్టేట్ సెటిల్‌మెంట్లే విభేదాలకు కారణం
పోలీసుల దర్యాప్తు ప్రకారం నయీం, ఉమామహేష్ బాల్య స్నేహితులు. చిన్నతనం నుంచే నేర కార్యకలాపాలకు పాల్పడిన వీరిపై ఇల్లందు పోలీస్‌స్టేషన్‌లో రౌడీషీట్లు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. కొంతకాలంగా ఇల్లందు, కొత్తగూడెం, ఖమ్మం, హైదరాబాద్ ప్రాంతాల్లో రియల్ ఎస్టేట్ సెటిల్‌మెంట్లు చేస్తూ వచ్చారని పేర్కొన్నారు.
ఓ రియల్ ఎస్టేట్ సెటిల్‌మెంట్ విషయంలో ఇద్దరి మధ్య విభేదాలు ఏర్పడి, అవి క్రమంగా పరస్పర కక్షకు దారితీసినట్లు దర్యాప్తులో వెల్లడైంది. నయీం హైదరాబాద్‌లో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తుండగా.. ఉమామహేష్ ఖమ్మంలో సోలార్ ప్యానల్స్ వ్యాపారం నిర్వహిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
ఖమ్మం హోటల్‌లో హత్యకు పథకం
నయీంను హత్య చేసేందుకు ఈ నెల 13న ఖమ్మంలోని ఓ హోటల్‌లో ఉమామహేష్ తన అనుచరులతో కలిసి పథకం రచించినట్లు పోలీసులు వెల్లడించారు. అనంతరం మరుసటి రోజు నిందితులు కారులో ఖమ్మం నుంచి హైదరాబాద్‌కు వచ్చారు.
మున్నా ద్వారా నయీంకు ఫోన్ చేయించి అతడి ఆచూకీ తెలుసుకున్నారని, బండ్లగూడ సుప్రీం వైన్స్‌లో నయీం ఉన్నట్లు నిర్ధారించుకున్న తర్వాత అక్కడికి వెళ్లినట్లు దర్యాప్తులో తేలింది. నయీంపై దాడి చేసే సమయంలో అతడి కళ్లలో కారం చల్లి, వెంబడించి వేటకొడవళ్లతో హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు.
ప్రత్యేక బృందాలతో గాలింపు
ఈ కేసులో పరారీలో ఉన్న నిందితుల కోసం మల్కాజిగిరి పోలీస్ కమిషనర్ బి.సుమతి ఆదేశాలతో ఎల్.బి.నగర్ డీసీపీ బి.అనురాధ, ఎస్‌ఓటీ ఏసీపీ రవీందర్‌రెడ్డి పర్యవేక్షణలో నాగోల్ పోలీసులు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు.
విస్తృతంగా గాలింపు చేపట్టిన పోలీసులు తాజాగా ప్రధాన సూత్రధారి ఉమామహేష్‌తో పాటు మున్నా, కార్తీక్‌లను అరెస్టు చేశారు. దీంతో ఈ కేసులో మొత్తం 11 మంది నిందితులను అరెస్టు చేసినట్లు నాగోల్ ఇన్‌స్పెక్టర్ మహమ్మద్ మక్బూల్ జానీ తెలిపారు.

Post a Comment