మంథనిలో మంత్రి శ్రీధర్ బాబు విస్తృత పర్యటన.. యువతకు ఉద్యోగాలు, పెట్టుబడులపై కీలక హామీలు
మంథనిలో మంత్రి శ్రీధర్ బాబు విస్తృత పర్యటన.. యువతకు ఉద్యోగాలు, పెట్టుబడులపై కీలక హామీలు
మంథని, ఆగస్టు 3: స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు కల్పించే అభివృద్ధి, పెట్టుబడులే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, శాసన వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు తెలిపారు. పరిశ్రమలకు అవసరమైన విద్యుత్, నీరు, మౌలిక వసతులను ప్రభుత్వం కల్పిస్తుందని, ప్రభుత్వం–పరిశ్రమలు కలిసి పనిచేస్తే సమాజానికి మరింత మేలు జరుగుతుందని అన్నారు.
సోమవారం జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్షతో కలిసి మంథని పట్టణంలో మంత్రి విస్తృతంగా పర్యటించారు. ఈ సందర్భంగా శివకిరణ్ గార్డెన్‌లో ఏర్పాటు చేసిన 'మన ఊరు–మన కోచింగ్ సెంటర్' ఉచిత కానిస్టేబుల్, ఎస్సై కోచింగ్ సెంటర్‌ను ప్రారంభించారు. అనంతరం ఎస్‌ఎల్‌బీ గార్డెన్‌లో టీ వర్క్స్ ఆధ్వర్యంలో నిర్వహించిన పాఠశాల విద్యార్థుల క్రీడా పోటీల విజేతలకు బహుమతులు అందజేసి ఉచిత హెల్మెట్లను పంపిణీ చేశారు.
మంథని క్యాంపు కార్యాలయంలో హిందుస్థాన్ కోకాకోలా బెవరేజెస్‌తో పాటు ఇతర పరిశ్రమల ప్రతినిధులు, జిల్లా అధికారులతో సమావేశమై పరిశ్రమల అభివృద్ధిపై సమీక్ష నిర్వహించారు. అనంతరం కోకాకోలా సంస్థ సీఎస్‌ఆర్ కార్యక్రమం 'ప్రాజెక్ట్ షైన్' కింద చేపట్టనున్న బొక్కలవాగు చెక్‌డ్యామ్ అప్‌గ్రేడేషన్, సుందరీకరణ పనులకు శంకుస్థాపన చేశారు. అలాగే మంథని ప్రభుత్వ సివిల్ ఆసుపత్రిలో డెవలప్‌మెంట్ కమిటీ సమావేశంలో పాల్గొని వైద్య సేవల మెరుగుదలపై అధికారులకు పలు సూచనలు చేశారు. రత్నాపూర్ గ్రామంలో ప్రతిపాదిత కోకాకోలా పరిశ్రమ స్థలాన్ని కూడా పరిశీలించారు.
మంత్రి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటికే 70 వేల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేసిందని, ప్రస్తుతం మరో 7 వేలకుపైగా పోలీస్ ఉద్యోగాల భర్తీ ప్రక్రియ కొనసాగుతోందని తెలిపారు. ఉద్యోగాల కోసం సిద్ధమవుతున్న యువత రాబోయే మూడు నెలలు క్రమశిక్షణతో లక్ష్య సాధన కోసం కృషి చేయాలని సూచించారు.
అదేవిధంగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించేందుకు అవసరమైన మౌలిక వసతులు, వైద్య పరికరాలు, ఇతర సౌకర్యాలను కల్పించాలని అధికారులను మంత్రి ఆదేశించారు.
ఈ కార్యక్రమాల్లో ఆర్డీవో సురేష్, మున్సిపల్ చైర్మన్ శ్రీనివాస్, సయేందర్ రెడ్డి, తహసీల్దార్ ఆరిఫ్ ఉద్దీన్, ప్రజాప్రతినిధులు, హిందుస్థాన్ కోకాకోలా బెవరేజెస్ ప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు, విద్యార్థులు, యువత, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.

Post a Comment