ఆర్థిక ఆరోపణలు.. మంథని మండల పరిషత్ సీనియర్ అసిస్టెంట్ సస్పెన్షన్
ఆర్థిక ఆరోపణలు.. మంథని మండల పరిషత్ సీనియర్ అసిస్టెంట్ సస్పెన్షన్
పెద్దపల్లి, ఆగస్టు 11: ఆర్థిక ఆరోపణలు, విధుల నిర్వహణలో నిర్లక్ష్యానికి పాల్పడినట్లు ప్రాథమిక విచారణలో తేలడంతో మంథని మండల పరిషత్ కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న కె.ఎన్. జయ ప్రకాశ్‌ను సస్పెండ్ చేసినట్లు పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష తెలిపారు.
ఆగస్టు 7న మంథని మండల పరిషత్ కార్యాలయంలో మండల స్థాయి అధికారులు, సర్పంచ్‌లతో నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో జయ ప్రకాశ్‌పై ప్రజాప్రతినిధులు, ఉద్యోగులు, పదవీ విరమణ పొందిన ఉద్యోగులు పలు ఆర్థిక ఆరోపణలు చేసినట్లు కలెక్టర్ వెల్లడించారు. ఈ ఫిర్యాదులను తీవ్రంగా పరిగణించిన అధికారులు ప్రాథమిక విచారణ చేపట్టారు.
విచారణలో విధుల నిర్వహణలో తీవ్ర నిర్లక్ష్యం, విధుల పట్ల అంకితభావం లోపించడం, ప్రభుత్వ ఉద్యోగికి తగని ప్రవర్తన వంటి అంశాలు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చినట్లు కలెక్టర్ తెలిపారు. ఈ చర్యలు తెలంగాణ రాష్ట్ర సివిల్ సర్వీసెస్ (ప్రవర్తనా) నిబంధనలు–1964లోని రూల్ 3(1), 3(2)కు విరుద్ధంగా ఉన్నట్లు ప్రాథమికంగా నిర్ధారించినట్లు పేర్కొన్నారు.
ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర సివిల్ సర్వీసెస్ (క్లాసిఫికేషన్, కంట్రోల్ అండ్ అప్పీల్) రూల్స్–1991లోని రూల్ 20 ప్రకారం శాఖాపరమైన విచారణ చేపట్టనున్నట్లు కలెక్టర్ తెలిపారు. విచారణ పూర్తయ్యే వరకు CCA రూల్స్–1991లోని రూల్ 8(1) ప్రకారం జయ ప్రకాశ్‌ను తక్షణమే సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసినట్లు వెల్లడించారు.
సస్పెన్షన్ కాలంలో ముందస్తు అనుమతి లేకుండా ప్రధాన కార్యాలయాన్ని విడిచి వెళ్లరాదని ఆదేశించారు. నిబంధనల ప్రకారం సస్పెన్షన్ కాలానికి సంబంధించిన జీవనాధార భత్యంతో పాటు డీఏ, ఇతర పరిహార భత్యాలు చెల్లించనున్నట్లు కలెక్టర్ స్పష్టం చేశారు.
ప్రభుత్వ కార్యాలయాల్లో విధులు నిర్వహించే అధికారులు, సిబ్బంది నిబంధనలకు అనుగుణంగా బాధ్యతాయుతంగా విధులు నిర్వర్తించాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష సూచించారు. ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులను నిర్లక్ష్యం చేయకుండా, ఎలాంటి అవకతవకలకు తావులేకుండా పారదర్శకంగా విధులు నిర్వహించాలని అధికారులను ఆదేశించారు.

Post a Comment