శంషాబాద్‌లో ఘోరం.. రన్నింగ్ బస్సులో మహిళపై కండక్టర్ దాడి
శంషాబాద్‌లో ఘోరం.. రన్నింగ్ బస్సులో మహిళపై కండక్టర్ దాడి
హైదరాబాద్: శంషాబాద్‌లో ఆర్టీసీ బస్సులో మహిళపై కండక్టర్ దాడి చేసిన ఘటన కలకలం రేపుతోంది. బస్సును తన గమ్యస్థానంలో ఆపకపోవడంపై ప్రశ్నించినందుకు కండక్టర్ తన చెంపపై కొట్టాడని బాధిత మహిళ ఆరోపించింది. ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
వివరాల ప్రకారం.. శంషాబాద్‌లో ఓ మహిళ బస్సు ఎక్కి మదన్‌పల్లి తండా వద్ద దిగేందుకు టికెట్ తీసుకుంది. అయితే బస్సు డ్రైవర్ ఆమె దిగాల్సిన ప్రాంతంలో బస్సును ఆపకుండా కొత్తూరు వద్ద ఆపినట్లు తెలుస్తోంది. దీంతో తనను నిర్దేశిత స్టాప్‌లో ఎందుకు దించలేదని మహిళ డ్రైవర్‌ను ప్రశ్నించింది.
ఈ క్రమంలో కండక్టర్ జోక్యం చేసుకుని తనపై చేయి చేసుకున్నాడని మహిళ ఆరోపించింది. తాను మహిళనని కూడా చూడకుండా చెంపపై కొట్టాడంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. తన భర్త లేడని, పిల్లాడితో కలిసి జీవిస్తున్నానని చెబుతూ బాధితురాలు కన్నీటి పర్యంతమైంది.
ఈ ఘటనను అక్కడున్న కొందరు వ్యక్తులు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. వీడియో వైరల్ కావడంతో నెటిజన్లు స్పందిస్తూ.. ప్రయాణికులతో ఆర్టీసీ సిబ్బంది మర్యాదగా వ్యవహరించాలని, మహిళపై దాడి చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న కండక్టర్‌పై అధికారులు విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
అయితే, ఘటనకు సంబంధించి ఆర్టీసీ అధికారుల అధికారిక వివరణ ఇంకా వెలువడాల్సి ఉంది. బాధితురాలి ఆరోపణలపై అధికారులు విచారణ చేపడితే పూర్తి వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.

Post a Comment