-->

పోలీస్ వాహనం బోల్తా పడిన ప్రమాదంలో ఓ కానిస్టేబుల్ మృతి

పోలీస్ వాహనం బోల్తా పడిన ప్రమాదంలో ఓ కానిస్టేబుల్ మృతి
పోలీస్ వాహనం బోల్తా పడిన ప్రమాదంలో ఓ కానిస్టేబుల్ మృతి

విజయనగరం: పోలీస్ వాహనం బోల్తా పడిన ప్రమాదంలో ఓ కానిస్టేబుల్ మృతి చెందిన విషాద ఘటన విజయనగరం జిల్లా కొండకరకాం సమీపంలో చోటుచేసుకుంది. కేసు దర్యాప్తులో భాగంగా విజయనగరం రూరల్ పోలీసులు జీపులో ప్రభుత్వ వైద్య కళాశాల నుంచి కొండకరకాం వైపు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.

కొండకరకాం ఘాట్ వద్ద జీపు బ్రేకులు ఫెయిల్ కావడంతో వాహనం అదుపుతప్పి చెట్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో జీపులో ఉన్న ఎస్సై అశోక్ కుమార్, కానిస్టేబుళ్లు నాగేంద్ర, వెంకటరమణతో పాటు డ్రైవర్ రాజాబాబుకు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను వెంటనే ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు.

అయితే తీవ్రంగా గాయపడిన కానిస్టేబుల్ వెంకటరమణ (49) చికిత్స పొందుతూ మృతి చెందారు. దీంతో పోలీసు వర్గాల్లో విషాదం నెలకొంది.

ప్రమాద విషయం తెలుసుకున్న మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఆస్పత్రికి వెళ్లి క్షతగాత్రులను పరామర్శించారు. వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్న ఆయన, బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని జిల్లా ఉన్నతాధికారులను ఆదేశించారు.

ఈ ఘటనపై రాష్ట్ర హోంమంత్రి అనిత తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. జిల్లా ఎస్పీ దామోదర్‌తో ఫోన్‌లో మాట్లాడిన హోంమంత్రి.. ప్రమాదానికి సంబంధించిన వివరాలను తెలుసుకున్నారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు.

కానిస్టేబుల్ వెంకటరమణ మృతి అత్యంత బాధాకరమని హోంమంత్రి అనిత పేర్కొన్నారు. విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన కానిస్టేబుల్ కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. బాధిత కుటుంబానికి అవసరమైన సహాయం అందించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

ప్రమాదానికి గల పూర్తి కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రాథమికంగా బ్రేకులు ఫెయిల్ కావడంతోనే ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793