మంచిర్యాల జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నియామకం ఊసెత్తని కాంగ్రెస్
మంచిర్యాల జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నియామకం ఊసెత్తని కాంగ్రెస్
ఇప్పటికే మూడేళ్లు పూర్తి.. ఇక మిగిలింది రెండేళ్లే..ఆశావహుల్లో నిరుత్సాహం
బెల్లంపల్లి, ఆగస్టు 2: రాష్ట్రంలోని దాదాపు అన్ని జిల్లాల్లో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ల నియామకాలు పూర్తయినప్పటికీ, మంచిర్యాల జిల్లాలో మాత్రం ఇప్పటికీ చైర్మన్ నియామకంపై ఎలాంటి స్పష్టత లేకపోవడం చర్చనీయాంశంగా మారింది. ప్రభుత్వం ఏర్పడి మూడేళ్లకు చేరువవుతున్నా కాంగ్రెస్ పార్టీ నుంచి ఈ పదవిపై నిర్ణయం వెలువడకపోవడంతో ఆశావహులు తీవ్ర నిరాశ వ్యక్తం చేస్తున్నారు.
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ఆదిలాబాద్, నిర్మల్, కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలకు ఇప్పటికే గ్రంథాలయ సంస్థ చైర్మన్‌లను నియమించగా, మంచిర్యాల జిల్లాను మాత్రం పక్కన పెట్టారని స్థానిక కాంగ్రెస్ నాయకులు, ఆశావహులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పార్టీ అంతర్గత విభేదాల కారణంగానే నియామకం ఆలస్యం అవుతోందనే ప్రచారం రాజకీయ వర్గాల్లో సాగుతోంది.
ప్రభుత్వ పదవీకాలంలో ఇప్పటికే మూడేళ్లు పూర్తికావడంతో, మిగిలింది మరో రెండేళ్ల సమయమేనని, ఇప్పటికైనా పార్టీ అధిష్ఠానం చొరవ తీసుకుని జిల్లా గ్రంథాలయ సంస్థకు చైర్మన్‌ను నియమించాలని పార్టీ నాయకులు, కార్యకర్తలు కోరుతున్నారు.
బీఆర్‌ఎస్ హయాంలో గ్రంథాలయాల అభివృద్ధి
ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్ర పాలనలో జిల్లాలోని అనేక గ్రంథాలయాలు నిర్లక్ష్యానికి గురయ్యాయని, పక్కా భవనాలు, ఫర్నిచర్, చదువుకునే సౌకర్యాలు లేక విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొనేవారని స్థానికులు గుర్తు చేస్తున్నారు.
ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన అనంతరం అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని బీఆర్‌ఎస్ ప్రభుత్వం గ్రంథాలయాల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించిందని చెబుతున్నారు. మంచిర్యాల, బెల్లంపల్లి, చెన్నూర్ ప్రధాన గ్రంథాలయాల్లో ఆధునిక భవనాలు, ఫర్నిచర్, స్టడీ మెటీరియల్‌తో పాటు పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే అభ్యర్థులకు అవసరమైన వసతులు కల్పించారని పేర్కొంటున్నారు.
జిల్లా, మండల కేంద్రాల్లోని గ్రంథాలయాలకు కూడా మౌలిక సదుపాయాలు మెరుగుపరచడంతో, ఒకప్పుడు నిరుపయోగంగా ఉన్న గ్రంథాలయాలు ప్రస్తుతం విద్యార్థులు, పాఠకులకు ఉపయోగకరంగా మారాయని స్థానికులు అభిప్రాయపడుతున్నారు.
ప్రస్తుతం జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నియామకం కూడా త్వరగా చేపట్టి గ్రంథాలయాల అభివృద్ధికి మరింత ఊతమివ్వాలని ప్రజలు, విద్యార్థులు, ఆశావహులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

Post a Comment