-->

రెంట్ బాయ్‌ఫ్రెండ్’ ఆఫర్లతో అమ్మాయిలకు సైబర్ కేటుగాళ్ల వల.. జాగ్రత్త: సజ్జనార్ హెచ్చరిక

 

రెంట్ బాయ్‌ఫ్రెండ్’ ఆఫర్లతో అమ్మాయిలకు సైబర్ కేటుగాళ్ల వల.. జాగ్రత్త: సజ్జనార్ హెచ్చరిక

‘రెంట్ బాయ్‌ఫ్రెండ్’ ఆఫర్లతో అమ్మాయిలకు సైబర్ కేటుగాళ్ల వల.. జాగ్రత్త: సజ్జనార్ హెచ్చరిక

హైదరాబాద్: సోషల్ మీడియా వేదికగా జరుగుతున్న సైబర్ మోసాలపై హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ మరోసారి ప్రజలను అప్రమత్తం చేశారు. ముఖ్యంగా యువతులు, అమ్మాయిలను లక్ష్యంగా చేసుకుని సైబర్ నేరగాళ్లు కొత్త తరహా ‘రెంట్ బాయ్‌ఫ్రెండ్’ డేటింగ్ ట్రాప్కు తెరతీశారని హెచ్చరించారు.

‘ఒంటరిగా ఉన్నారా? మీతో కాఫీ తాగేందుకు, సినిమాకు వెళ్లేందుకు అందమైన అబ్బాయి కావాలా? అదీ 50 శాతం డిస్కౌంట్‌తో’ అంటూ సోషల్ మీడియాలో కనిపించే ఆకర్షణీయమైన ప్రకటనలను నమ్మొద్దని సూచించారు. రంగురంగుల పోస్టర్లు, అందమైన యువకుల ఫొటోలు, డిస్కౌంట్ ఆఫర్ల వెనుక సైబర్ మోసం దాగి ఉండే అవకాశం ఉందన్నారు.

‘50% OFF’ అంటూ ఆకర్షణ

ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, టెలిగ్రామ్ వంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో “1st August Special – 50% OFF”, “Rent Boyfriend – Your Personal Companion” వంటి పేర్లతో పోస్టర్లు పెట్టి యువతులను ఆకర్షించే ప్రయత్నాలు జరుగుతున్నాయని సజ్జనార్ తెలిపారు.

కాఫీ మీటింగ్, సినిమా డేట్, షాపింగ్, ఈవెంట్లు, పెళ్లిళ్లకు తోడుగా రావడం, ఫుల్ డే ప్యాకేజీ వంటి పేర్లతో సేవలను అందిస్తామంటూ ప్రచారం చేస్తున్నారని చెప్పారు. గోప్యత, భద్రతకు పూర్తి హామీ ఇస్తామని, ఇది చట్టవిరుద్ధమైన వ్యాపారం కాదని నమ్మించే ప్రయత్నం చేస్తారని వివరించారు.

AI ఫొటోలతో నకిలీ ప్రొఫైల్స్

సైబర్ నేరగాళ్లు ఏఐతో రూపొందించిన లేదా ఇంటర్నెట్ నుంచి సేకరించిన అందమైన యువకుల ఫొటోలను ప్రొఫైల్ పిక్చర్లుగా ఉపయోగిస్తున్నారని సజ్జనార్ హెచ్చరించారు. ఆసక్తి చూపి మెసేజ్ చేసే యువతులతో తొలుత ఎంతో మర్యాదగా, ఆప్యాయంగా మాట్లాడతారని తెలిపారు.

ఆ తర్వాత బుకింగ్ కన్ఫర్మేషన్, సెక్యూరిటీ డిపాజిట్, అడ్వాన్స్ అమౌంట్ అంటూ డబ్బులు డిమాండ్ చేస్తారని చెప్పారు. డిజిటల్ వాలెట్లు, యూపీఐ, క్యూఆర్ కోడ్ల ద్వారా వేలాది రూపాయలు చెల్లించిన తర్వాత బాధితులను బ్లాక్ చేసి మాయమవుతారని వివరించారు.

వ్యక్తిగత సమాచారంతో బ్లాక్‌మెయిల్ చేసే ప్రమాదం

ఇలాంటి ఆన్‌లైన్ పరిచయాలను నమ్మి అపరిచిత వ్యక్తులను నేరుగా కలవడం కూడా ప్రమాదకరమని సజ్జనార్ హెచ్చరించారు. ప్రేమ, స్నేహం పేరుతో నమ్మించి వ్యక్తిగత వివరాలు, ఫోన్ నంబర్లు, ఫొటోలు, ఇతర సమాచారాన్ని సేకరించే అవకాశం ఉందన్నారు.

ఆ తర్వాత అదే సమాచారాన్ని ఉపయోగించి బెదిరింపులు, బ్లాక్‌మెయిలింగ్, మరిన్ని డబ్బుల డిమాండ్లు చేసే ప్రమాదం ఉందని తెలిపారు.

యువతులు ఏం చేయాలి?

  • సోషల్ మీడియాలో కనిపించే ‘రెంట్ బాయ్‌ఫ్రెండ్’ లేదా డేటింగ్ ఆఫర్లను గుడ్డిగా నమ్మొద్దు.
  • అపరిచిత వ్యక్తులకు ముందస్తుగా డబ్బులు పంపొద్దు.
  • క్యూఆర్ కోడ్, డిజిటల్ వాలెట్ ద్వారా చెల్లింపులు చేయడానికి ముందు పూర్తిగా ధృవీకరించుకోవాలి.
  • వ్యక్తిగత ఫొటోలు, ఫోన్ నంబర్, చిరునామా వంటి వివరాలను అపరిచితులతో పంచుకోవద్దు.
  • ఆన్‌లైన్ పరిచయమైన వ్యక్తులను ఒంటరిగా కలవడానికి వెళ్లొద్దు.
  • అనుమానాస్పద ప్రొఫైల్స్, ప్రకటనలను వెంటనే రిపోర్ట్ చేసి బ్లాక్ చేయాలి.
  • ఇప్పటికే డబ్బులు చెల్లించి మోసపోయినట్లయితే ఆలస్యం చేయకుండా సైబర్ పోలీసులను సంప్రదించాలి.

ఆకర్షణీయమైన ఆఫర్లు కనిపించాయనే కారణంతో వాటిని నిజమని నమ్మొద్దని.. సోషల్ మీడియాలో పరిచయం లేని వ్యక్తులతో వ్యవహరించేటప్పుడు అప్రమత్తంగా ఉండాలని సజ్జనార్ యువతులకు సూచించారు.

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793