సికింద్రాబాద్ రైల్వే పరిధిలో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం
సికింద్రాబాద్ రైల్వే పరిధిలో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం
సికింద్రాబాద్: సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పరిధిలోని దబీర్‌పుర–మేడ్చల్ మార్గంలో రైల్వే పట్టాలపై గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది. బుధవారం తెల్లవారుజామున కిలోమీటర్ నంబర్ 586/17-18 వద్ద మృతదేహాన్ని గుర్తించినట్లు రైల్వే పోలీసులు తెలిపారు.
సికింద్రాబాద్ డిప్యూటీ స్టేషన్ సూపరింటెండెంట్ నుంచి సమాచారం అందడంతో ఎస్‌హెచ్‌ఓ ఘటనాస్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతుడు సుమారు 35 నుంచి 40 ఏళ్ల వయస్సు కలిగి ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ప్రాథమికంగా రైలు కింద పడి మృతి చెందినట్లు అనుమానిస్తున్నప్పటికీ.. మృతికి గల పూర్తి కారణాలు దర్యాప్తులో తేలాల్సి ఉంది.
పోలీసుల వివరాల ప్రకారం.. మృతుడి ఒంటిపై నీలం రంగు బనియన్, ఆరు జేబులు ఉన్న బ్లూ కలర్ జీన్స్ ప్యాంట్ ఉన్నాయి. ఛాతి ఎడమ వైపున టాటూ గుర్తు ఉన్నట్లు తెలిపారు. మృతుడి ముఖం కోలగా ఉండి, సుమారు 5.5 అడుగుల ఎత్తు ఉన్నట్లు పోలీసులు వివరించారు.
మృతుడిని ఎవరైనా గుర్తించినట్లయితే 9440083160, 87012685851 నంబర్లకు సమాచారం అందించాలని రైల్వే పోలీసులు కోరారు. మృతదేహం గుర్తింపు, ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలపై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. మృతుడి వివరాలు తెలిసిన వారు పై నంబర్లకు సమాచారం అందించవచ్చు.

Post a Comment