ఘోర రోడ్డు ప్రమాదం.. లారీ, ఆటో ఢీ
ఘోర రోడ్డు ప్రమాదం.. లారీ, ఆటో ఢీ
నలుగురు మహిళలు మృతి.. మరో నలుగురికి తీవ్ర గాయాలు
మంచిర్యాల: మంచిర్యాల జిల్లాలో సోమవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. శ్రీరాంపూర్ నేషనల్ హైవేపై నస్పూర్ గేటు వద్ద లారీ, ఆటో ఢీకొన్న ఘటనలో నలుగురు మహిళలు మృతిచెందారు. మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను తొలుత మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించగా, పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం వరంగల్, కరీంనగర్ ఆసుపత్రులకు తరలించారు.
పోలీసుల వివరాల ప్రకారం.. మందమర్రి మండలం పొన్నారం, వెంకటాపూర్, గుడిపెల్లి గ్రామాలకు చెందిన ఏడుగురు మహిళలు మంచిర్యాలలోని షాపింగ్ మాల్స్, ఇతర సంస్థల్లో పనిచేస్తున్నారు. ప్రతిరోజూ మాదిరిగానే సోమవారం ఉదయం విధులకు వెళ్లేందుకు ఆటోలో బయలుదేరారు. నస్పూర్ గేటు వద్దకు చేరుకోగానే ముందునుంచి వచ్చిన బైక్‌ను తప్పించే క్రమంలో ఆటో అదుపుతప్పింది. అదే సమయంలో మంచిర్యాల నుంచి జైపూర్ వైపు వెళ్తున్న లారీని ఆటో బలంగా ఢీకొట్టింది.
ఢీకొన్న వేగానికి ఆటో గాల్లోకి ఎగిరి కిందపడటంతో పూర్తిగా నుజ్జునుజ్జయింది. ప్రమాదంలో చింతకుంట్ల లక్ష్మి (28), అగ్గు సౌందర్య (34) అక్కడికక్కడే మృతిచెందారు. తోటపల్లి సోని (25), తొగరి సుమలత (25) ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందారు.
మృతులను మందమర్రి మండలం పొన్నారం గ్రామానికి చెందిన చింతకుంట్ల లక్ష్మి, తోటపల్లి సోని, గుడిపెల్లి, వెంకటాపూర్ గ్రామాలకు చెందిన అగ్గు సౌందర్య, తొగరి సుమలతగా పోలీసులు గుర్తించారు.
ఈ ప్రమాదంలో సల్లూరి అనూష, రాంటెంకి దివ్యవాణి, శీలం భాను, ఆటో డ్రైవర్ సెగ్యం ప్రశాంత్ తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో ఓ మహిళ పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.
ఘటనాస్థలిని పరిశీలించిన పోలీసులు
ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే రామగుండం సీపీ అంబర్ కిశోర్ ఝా, డీసీపీ ఎ.భాస్కర్, ఏసీపీ ప్రకాశ్, మంచిర్యాల సీఐ రవీందర్ ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు. అనంతరం ఆసుపత్రికి వెళ్లి క్షతగాత్రుల పరిస్థితిని తెలుసుకున్నారు. ప్రమాదానికి ఆటో డ్రైవర్ నిర్లక్ష్యం, అతివేగమే కారణమని సీపీ అంబర్ కిశోర్ ఝా తెలిపారు. ఈ ఘటనపై మంచిర్యాల పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
మరో పది నిమిషాల్లో గమ్యస్థానానికి చేరుకునేలోపే..
ప్రమాదానికి గురైన మహిళలు గత రెండేళ్లుగా గుడిపెల్లికి చెందిన ప్రశాంత్ ఆటోలో ప్రతిరోజూ మంచిర్యాలకు వెళ్లి తిరిగి సాయంత్రం గ్రామాలకు వస్తున్నారు. సోమవారం ఉదయం ప్రశాంత్ కొందరిని మంచిర్యాలలో దింపి తిరిగి వచ్చాడు. రెండో ట్రిప్‌లో ఏడుగురు మహిళలను తీసుకుని వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.
మరో పది నిమిషాల్లో వారు తమ పని ప్రదేశాలకు చేరుకోవాల్సి ఉండగా జరిగిన ప్రమాదం నాలుగు కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది.

Post a Comment