నిమ్స్ డాక్టర్ లక్ష్మీ భాస్కర్ కేసులో ఏసీబీ పలువురు ఉద్యోగుల ఇళ్లలోనూ సోదాలు
నిమ్స్ డాక్టర్ లక్ష్మీ భాస్కర్ కేసులో ఏసీబీ పలువురు ఉద్యోగుల ఇళ్లలోనూ సోదాలు
హైదరాబాద్: నిమ్స్ అదనపు మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ లక్ష్మీ భాస్కర్‌కు సంబంధించిన ఆదాయానికి మించిన ఆస్తుల (డీఏ) కేసులో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు మరోసారి సోదాలు నిర్వహిస్తున్నారు. కేసు దర్యాప్తులో భాగంగా నిమ్స్‌కు చెందిన పలువురు ఉద్యోగుల ఇళ్లలోనూ ఏసీబీ అధికారులు తనిఖీలు చేపట్టినట్లు సమాచారం.
మొత్తం ఐదు మంది నిమ్స్ ఉద్యోగులకు చెందిన నివాసాల్లో ఏకకాలంలో సోదాలు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ తనిఖీల్లో భాగంగా నిమ్స్ బార్బర్‌గా పనిచేస్తున్న ధన్‌రాజ్ ఇంట్లో సుమారు రూ.7 లక్షల నగదును ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం.
డాక్టర్ లక్ష్మీ భాస్కర్ కేసులో ఆస్తుల కొనుగోళ్లు, నగదు లావాదేవీలు, మనీ ట్రయిల్‌తో పాటు బినామీ పేర్లపై ఉన్న ఆస్తుల వివరాలను ఏసీబీ అధికారులు పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. లక్ష్మీ భాస్కర్‌కు సంబంధించిన ఆస్తులతో పాటు ఆమెకు సన్నిహితంగా ఉన్న వ్యక్తుల ఆర్థిక లావాదేవీలను కూడా అధికారులు పరిశీలిస్తున్నట్లు సమాచారం.
ఇప్పటికే ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో డాక్టర్ లక్ష్మీ భాస్కర్‌కు సుమారు రూ.100 కోట్ల వరకు అక్రమాస్తులు ఉన్నట్లు అధికారులు గుర్తించినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో దర్యాప్తును మరింత విస్తరించిన ఏసీబీ.. ఆస్తులకు సంబంధించిన పత్రాలు, నగదు లావాదేవీలు, బినామీ ఆస్తుల వివరాలను సేకరిస్తున్నట్లు తెలుస్తోంది.
తాజా సోదాల్లో లభించిన నగదు, పత్రాలు, ఇతర ఆధారాలను పరిశీలించిన అనంతరం కేసులో మరిన్ని వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. అయితే సోదాలు, స్వాధీనం చేసుకున్న నగదు, ఆస్తుల విలువకు సంబంధించిన తుది వివరాలను ఏసీబీ అధికారికంగా వెల్లడించాల్సి ఉంది.

Post a Comment