-->

ఉభయ సభలను ఊపేసిన స్పీకర్‌ దూషణ పర్వం.. బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీలపై సస్పెన్షన్‌ వేటు

 

ఉభయ సభలను ఊపేసిన స్పీకర్‌ దూషణ పర్వం.. బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీలపై సస్పెన్షన్‌ వేటు

ఉభయ సభలను ఊపేసిన స్పీకర్‌ దూషణ పర్వం.. బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీలపై సస్పెన్షన్‌ వేటు

హైదరాబాద్‌: తెలంగాణ రాజకీయాల్లో స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌కుమార్‌పై బీఆర్‌ఎస్‌ నేతలు చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న అనుచిత వ్యాఖ్యల వ్యవహారం తీవ్ర దుమారం రేపింది. ఈ అంశంపై శాసనసభ, శాసనమండలిలో అధికార–ప్రతిపక్ష సభ్యుల మధ్య వాగ్వాదం, నిరసనలతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ నేపథ్యంలో బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీలు తాతా మధు, నవీన్‌కుమార్‌రెడ్డిపై శాసనమండలి ఛైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి సస్పెన్షన్‌ వేటు వేశారు.

ప్రస్తుత సమావేశాలు ముగిసే వరకు సస్పెన్షన్‌

శాసనమండలి సమావేశాలు ప్రారంభమైన వెంటనే ఈ అంశం చర్చకు వచ్చింది. ఎమ్మెల్సీలు తాతా మధు, నవీన్‌కుమార్‌రెడ్డిలను సస్పెండ్‌ చేయాలని కోరుతూ మంత్రి శ్రీధర్‌బాబు మండలిలో తీర్మానం ప్రవేశపెట్టారు. అనంతరం ఛైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి మూజువాణి పద్ధతిలో ఓటింగ్‌ నిర్వహించారు. తీర్మానానికి సభ ఆమోదం లభించినట్లు ప్రకటిస్తూ.. ఇద్దరు ఎమ్మెల్సీలను ప్రస్తుత శాసనసభ సమావేశాలు పూర్తయ్యే వరకు సస్పెండ్‌ చేస్తున్నట్లు వెల్లడించారు.

ఈ పరిణామంతో మండలిలో ఒక్కసారిగా గందరగోళ పరిస్థితి నెలకొంది. బీఆర్‌ఎస్‌ సభ్యులు నిరసన వ్యక్తం చేయడంతో కొంతసేపు సభలో ఉద్రిక్తత కొనసాగింది. అనంతరం మండలి సమావేశాలను వాయిదా వేశారు.

అసెంబ్లీలోనూ తీవ్ర చర్చ

మండలిలో సస్పెన్షన్‌కు ముందే ఈ వ్యవహారంపై శాసనసభలో తీవ్ర చర్చ జరిగింది. స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌కుమార్‌పై చేసిన అనుచిత వ్యాఖ్యలను సభ తీవ్రంగా ఖండించింది. మంత్రి దామోదర రాజనర్సింహ ఈ అంశంపై తీర్మానాన్ని ప్రవేశపెట్టారు.

స్పీకర్‌ పట్ల సభామర్యాదలకు విరుద్ధంగా వ్యాఖ్యలు చేయడం, మహిళా సభ్యుల సమక్షంలో అసభ్యకరంగా ప్రవర్తించడం వంటి చర్యలను అసెంబ్లీ తీవ్రంగా తప్పుబట్టింది. ప్రజాస్వామ్య వ్యవస్థలో శాసనసభాపతి పదవికి ఉన్న గౌరవాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రతి సభ్యుడిపైనా ఉందని ప్రభుత్వం పేర్కొంది.

కేసీఆర్‌ బేషరతుగా క్షమాపణ చెప్పాలి

తమ పార్టీ నేతల అనుచిత ప్రవర్తనకు బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ పూర్తి బాధ్యత వహించాలని అసెంబ్లీ తీర్మానంలో పేర్కొన్నారు. స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌కుమార్‌కు కేసీఆర్‌ బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు.

అలాగే సంబంధిత సభ్యులపై శాసనమండలి నిబంధనల ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని అసెంబ్లీ తరఫున మండలి ఛైర్మన్‌కు సిఫార్సు చేశారు.

రాజకీయంగా మరింత వేడెక్కిన వాతావరణం

అసెంబ్లీలో తీర్మానం ఆమోదం పొందిన కొద్దిసేపటికే శాసనమండలిలో తాతా మధు, నవీన్‌కుమార్‌రెడ్డిలపై సస్పెన్షన్‌ వేటు పడటం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. దీంతో అధికార కాంగ్రెస్‌, ప్రతిపక్ష బీఆర్‌ఎస్‌ మధ్య ఇప్పటికే కొనసాగుతున్న రాజకీయ పోరు మరింత ముదిరింది.

స్పీకర్‌ పదవికి ఉన్న గౌరవాన్ని కాపాడేందుకు కఠిన చర్యలు తప్పవని అధికార పక్షం స్పష్టం చేస్తుండగా, ఈ వ్యవహారంపై బీఆర్‌ఎస్‌ ఎలాంటి రాజకీయ కార్యాచరణ చేపడుతుందన్నది ఆసక్తికరంగా మారింది.

Blogger ఆధారితం.