బీబీనగర్ వద్ద సిర్పూర్-కాగజ్‌నగర్ ఎక్స్‌ప్రెస్‌లో మంటలు.. తప్పిన పెను ప్రమాదం
బీబీనగర్ వద్ద సిర్పూర్-కాగజ్‌నగర్ ఎక్స్‌ప్రెస్‌లో మంటలు.. తప్పిన పెను ప్రమాదం
యాదాద్రి భువనగిరి జిల్లా: బీబీనగర్ సమీపంలో బుధవారం సిర్పూర్-కాగజ్‌నగర్ ఎక్స్‌ప్రెస్‌లో అకస్మాత్తుగా మంటలు చెలరేగడంతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. కాగజ్‌నగర్ వైపు వెళ్తున్న రైలు బీబీనగర్ రైల్వే స్టేషన్‌ను దాటుతున్న సమయంలో ఓ బోగీ చక్రం వద్ద నుంచి ఒక్కసారిగా పొగలు రావడంతో పాటు మంటలు కనిపించాయి. దీంతో ప్రయాణికులు భయంతో కేకలు వేయడంతో రైలులో కొద్దిసేపు తీవ్ర కలకలం నెలకొంది.
కో-పైలట్ అప్రమత్తతతో తప్పిన ప్రమాదం
ప్రాథమిక సమాచారం ప్రకారం.. రైలు చక్రానికి బ్రేక్ లైనర్ గట్టిగా ఒరుసుకుపోవడంతో ఘర్షణ ఏర్పడి అధిక వేడి ఉత్పత్తి కావడంతో పొగలు, మంటలు చెలరేగినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని కో-పైలట్ వెంటనే గుర్తించి లోకో పైలట్‌ను అప్రమత్తం చేశారు. దీంతో లోకో పైలట్ సమయస్ఫూర్తితో స్పందించి రైలును అత్యవసరంగా నిలిపివేశారు.
రైలు నిలిచిన వెంటనే ప్రయాణికులు అప్రమత్తమై కిందకు దిగారు. రైల్వే సిబ్బంది కూడా వెంటనే సహాయక చర్యలు చేపట్టడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది.
మంటలను అదుపులోకి తెచ్చిన అగ్నిమాపక సిబ్బంది
సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేసే చర్యలు చేపట్టారు. రైల్వే సిబ్బందితో కలిసి ఫైర్ సిబ్బంది శ్రమించి మంటలను పూర్తిగా ఆర్పివేశారు.
కో-పైలట్ అప్రమత్తత, లోకో పైలట్ తక్షణ చర్యలతో పెను ప్రమాదం తప్పినట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని సమాచారం. సంఘటనకు దారితీసిన కారణాలపై రైల్వే అధికారులు పూర్తి వివరాలను సేకరిస్తున్నారు.

Post a Comment