బిస్కెట్ గొంతులో ఇరుక్కుని ఏడాది చిన్నారి మృతి
బిస్కెట్ గొంతులో ఇరుక్కుని ఏడాది చిన్నారి మృతి
మహబూబ్‌నగర్: తెలంగాణలోని మహబూబ్‌నగర్ జిల్లాలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. మూసాపేట మండల పరిధిలోని సుర్తి తండాలో బిస్కెట్ గొంతులో ఇరుక్కుపోవడంతో ఏడాది వయసున్న చిన్నారి మృతి చెందాడు. ఈ ఘటనతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించగా, తండాలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
స్థానికులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. సుర్తి తండాకు చెందిన మూడవత్ శ్రీను, మౌనిక దంపతులకు ఇద్దరు కుమారులు ఉన్నారు. శనివారం రాత్రి మౌనిక తన ఏడాది వయసున్న చిన్న కుమారుడికి తినేందుకు బిస్కెట్లు ఇచ్చి ఇంటి పనుల్లో నిమగ్నమైంది.
బిస్కెట్ తింటున్న సమయంలో అది అనుకోకుండా చిన్నారి గొంతులో ఇరుక్కుపోయింది. దీంతో బాలుడికి శ్వాస తీసుకోవడం కష్టమై, ఊపిరాడక ఉక్కిరిబిక్కిరయ్యాడు. కొద్దిసేపటికే అపస్మారక స్థితిలోకి వెళ్లి కుప్పకూలిపోయాడు.
చిన్నారి పరిస్థితిని గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే అతడిని సమీపంలోని ఆసుపత్రికి హుటాహుటిన తరలించారు. అయితే ఆసుపత్రికి చేరుకునేలోపే బాలుడు మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.
కళ్లముందే చిన్నారి ప్రాణాలు కోల్పోవడంతో తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి. ఈ ఘటనతో సుర్తి తండాలో విషాద వాతావరణం నెలకొంది. అప్పటివరకు ఆడుకుంటూ కనిపించిన ఏడాది పసికందు ఒక్కసారిగా మృత్యువాత పడటంతో కుటుంబ సభ్యులు, బంధువులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు.

Post a Comment