విదేశీయులకు ఇళ్లు అద్దెకిచ్చే యజమానులకు పోలీసుల హెచ్చరిక
విదేశీయులకు ఇళ్లు అద్దెకిచ్చే యజమానులకు పోలీసుల హెచ్చరిక
హైదరాబాద్: విదేశీయులకు ఇళ్లు, హాస్టళ్లు, హోటళ్లు అద్దెకు ఇచ్చే యజమానులు అప్రమత్తంగా ఉండాలని హైదరాబాద్ పోలీసులు హెచ్చరించారు. విదేశీయులకు వసతి కల్పించే ముందు వారి పాస్‌పోర్ట్, వీసా తదితర పత్రాలను తప్పనిసరిగా పరిశీలించాలని సూచించారు.
నకిలీ పత్రాలతో లేదా వీసా గడువు ముగిసినప్పటికీ నగరంలో అక్రమంగా ఉంటున్న విదేశీయుల వివరాలు గుర్తించిన వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని అధికారులు స్పష్టం చేశారు. నిబంధనలు పాటించకుండా విదేశీయులకు వసతి కల్పించే యజమానులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఆగస్టు 31 నుంచి చేపట్టిన ప్రత్యేక తనిఖీల్లో అక్రమంగా నివసిస్తున్న 49 మంది విదేశీయులను పోలీసులు గుర్తించారు. వారిని తదుపరి చర్యల కోసం హోల్డింగ్ సెంటర్లకు తరలించినట్లు తెలిపారు.
పోలీసుల ప్రకారం, పట్టుబడిన వారిలో కొందరు డ్రగ్స్, గంజాయి, నకిలీ నోట్లు, మోసాలు, వ్యభిచారం తదితర నేరాలకు సంబంధించిన కేసుల్లో చిక్కుకున్నట్లు వెల్లడించారు. ఈ నేపథ్యంలో నగరంలో విదేశీయులకు అద్దెకు ఇళ్లు, హాస్టళ్లు, హోటల్ గదులు ఇచ్చే యజమానులు పూర్తి స్థాయిలో ధ్రువీకరణ ప్రక్రియను పాటించాలని పోలీసులు సూచించారు.
విదేశీయుల పత్రాలను పరిశీలించకుండా వసతి కల్పించడం వల్ల భవిష్యత్తులో చట్టపరమైన సమస్యలు తలెత్తే అవకాశం ఉందని పోలీసులు పేర్కొన్నారు. అందువల్ల వీసా గడువు, పాస్‌పోర్ట్ వివరాలు, గుర్తింపు పత్రాలను పరిశీలించిన తర్వాతే వసతి కల్పించాలని సూచించారు.

Post a Comment