పిల్లనివ్వలేదని కోపం.. మేనమామ ఇళ్లలో చోరీ!
పిల్లనివ్వలేదని కోపం.. మేనమామ ఇళ్లలో చోరీ!
మంచిర్యాల: తనకు నచ్చిన యువతిని వివాహం చేయలేదన్న కోపంతో ఓ యువకుడు మేనమామలకు చెందిన ఇళ్లలో చోరీకి పాల్పడిన ఘటన మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం ఇందారంలో వెలుగులోకి వచ్చింది.
పోలీసుల వివరాల ప్రకారం.. వెల్డింగ్ కార్మికుడైన మహ్మాద్ మగ్ధూంకు తనకు నచ్చిన యువతితో వివాహం చేయాలని కుటుంబ సభ్యులను కోరినట్లు తెలుస్తోంది. అయితే ఆమెను వేరే వ్యక్తికి ఇచ్చి పెళ్లి చేయడంతో మగ్ధూం ఆగ్రహానికి గురయ్యాడు. ఈ నేపథ్యంలో మేనమామలపై కోపంతో వారి ఇళ్లలో చోరీ చేయాలని నిర్ణయించుకున్నట్లు పోలీసులు తెలిపారు.
ఈ క్రమంలో తన స్నేహితుడు సబ్బని లక్ష్మీనారాయణతో కలిసి సెప్టెంబరు 28న ఇందారం ప్రాంతంలోని రెండు ఇళ్ల తాళాలు పగులగొట్టి చోరీకి పాల్పడ్డారు. ఇళ్లలో నుంచి సుమారు రూ.60 వేల నగదుతో పాటు బంగారు, వెండి ఆభరణాలను అపహరించినట్లు పోలీసులు వెల్లడించారు.
దొంగిలించిన నగదులో కొంత మొత్తాన్ని ఇద్దరూ పంచుకుని హైదరాబాద్‌కు వెళ్లి ఖర్చు చేసినట్లు దర్యాప్తులో తేలిందని పోలీసులు తెలిపారు. మిగిలిన బంగారు, వెండి ఆభరణాలను తీసుకెళ్తుండగా పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.
నిందితుల నుంచి 6 తులాల బంగారం, 45 తులాల వెండి, రూ.13,300 నగదు, ఒక ద్విచక్రవాహనాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Post a Comment