-->

రూ.1.50 కోట్ల చిట్టీల మోసం.. బాధితులకే ఐపీ నోటీసులు

 

సిద్దిపేట జిల్లా చేర్యాలలో కలకలం.. నిర్వాహకుడి ఇంటి ఎదుట బాధితుల ఆందోళన

రూ.1.50 కోట్ల చిట్టీల మోసం.. బాధితులకే ఐపీ నోటీసులు!

సిద్దిపేట జిల్లా చేర్యాలలో కలకలం.. నిర్వాహకుడి ఇంటి ఎదుట బాధితుల ఆందోళన

సిద్దిపేట: నమ్మకమే పెట్టుబడిగా చిట్టీల వ్యాపారం నిర్వహిస్తూ సుమారు రూ.1.50 కోట్ల మేర మోసానికి పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఓ చిట్టీల నిర్వాహకుడి వ్యవహారం సిద్దిపేట జిల్లాలో తీవ్ర కలకలం రేపుతోంది. తమ కష్టార్జితాన్ని చిట్టీల రూపంలో జమ చేసిన బాధితులకు డబ్బులు తిరిగి చెల్లించాల్సింది పోయి, నిర్వాహకుడు కోర్టు ద్వారా వారికే ఇన్‌సాల్వెన్సీ పిటిషన్ (ఐపీ) నోటీసులు పంపించడం వివాదాస్పదంగా మారింది. దీంతో బాధితులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆదివారం నిర్వాహకుడి ఇంటి ఎదుట ఆందోళనకు దిగారు.

అనధికారికంగా చిట్టీల వ్యాపారం

వివరాల్లోకి వెళ్తే.. సిద్దిపేట జిల్లా చేర్యాల పట్టణ శివారులోని బీడీ కాలనీ కేంద్రంగా మహ్మద్ అజీజ్ అహ్మద్ కొంతకాలంగా అనధికారికంగా చిట్టీల వ్యాపారం నిర్వహిస్తున్నట్లు బాధితులు ఆరోపిస్తున్నారు. ప్రారంభంలో చిట్టీల లావాదేవీలు సజావుగా సాగడంతో కాలనీవాసులు ఆయనపై నమ్మకం పెంచుకున్నారు. దీంతో పెద్ద సంఖ్యలో స్థానికులు చిట్టీల్లో చేరారు.

ముఖ్యంగా ఆడపిల్లల పెళ్లిళ్లు, ఇళ్ల నిర్మాణాలు, కుటుంబ అవసరాల కోసం కూలీనాలీ చేసుకుంటూ పైసాపైసా కూడబెట్టుకున్న డబ్బులను చిట్టీల రూపంలో జమ చేశారు. అయితే కొంతకాలం తర్వాత చిట్టీలు ఎత్తుకున్న వారికి డబ్బులు చెల్లించడంలో నిర్వాహకుడు జాప్యం చేయడం ప్రారంభించినట్లు బాధితులు చెబుతున్నారు. ఇతర సభ్యులు నెలవారీ వాయిదాలు చెల్లించడం లేదని సాకులు చెబుతూ కాలయాపన చేసినట్లు ఆరోపిస్తున్నారు.

డబ్బులు అడిగితే బాధితులకే ఐపీ నోటీసులు!

తమ డబ్బులు తిరిగి చెల్లించాలని బాధితులు ఒత్తిడి పెంచడంతో నిర్వాహకుడు అజీజ్ అహ్మద్ కోర్టును ఆశ్రయించినట్లు సమాచారం. తాను ఆర్థికంగా తీవ్రంగా నష్టపోయానని, అప్పులు తీర్చే స్థోమత లేదని పేర్కొంటూ ఇన్‌సాల్వెన్సీ పిటిషన్ దాఖలు చేసినట్లు బాధితులు వెల్లడిస్తున్నారు.

ఈ క్రమంలో కోర్టు నుంచి బాధితులకు ఐపీ నోటీసులు అందడంతో వారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాము చిట్టీల రూపంలో డబ్బులు చెల్లించినప్పటికీ, తమను అప్పుదారులుగా చిత్రీకరిస్తూ నోటీసులు పంపించడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. తమ కష్టార్జితాన్ని తిరిగి ఇవ్వాల్సిన బాధ్యత నిర్వాహకుడిపై ఉందని స్పష్టం చేస్తున్నారు.

బాధితుల్లో వితంతువులు, కూలీలు.. జీవితకాల పొదుపు ఆవిరి

ఈ చిట్టీల వ్యవహారంలో బాధితులుగా ఉన్న వారిలో పేద, మధ్యతరగతి కుటుంబాలకు చెందిన వారే అధికంగా ఉన్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా వితంతువులు, దినసరి కూలీలు, చిరు వ్యాపారులు తమ జీవితకాల పొదుపును కోల్పోయామని కన్నీరుమున్నీరవుతున్నారు. కుటుంబ అవసరాల కోసం దాచుకున్న డబ్బులు తిరిగి రాకపోవడంతో తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

తాము చెల్లించిన ప్రతి పైసాను తిరిగి ఇవ్వాలని, తమకు న్యాయం జరిగే వరకు పోరాటం ఆపబోమని బాధితులు హెచ్చరిస్తున్నారు. డబ్బులు చెల్లించకపోతే ఆమరణ నిరాహార దీక్షకు దిగుతామని ప్రకటించారు.

సీపీ కార్యాలయానికి బాధితులు

ఆదివారం నిర్వాహకుడి ఇంటి ఎదుట ఆందోళన చేపట్టిన బాధితులు అనంతరం ఈ వ్యవహారంపై ఫిర్యాదు చేసేందుకు జిల్లా పోలీస్ కమిషనర్ కార్యాలయానికి తరలివెళ్లారు. చిట్టీల పేరుతో జరిగినట్లు ఆరోపిస్తున్న ఆర్థిక మోసంపై సమగ్ర విచారణ జరిపించాలని, తమకు న్యాయం చేసి కష్టార్జితాన్ని తిరిగి ఇప్పించాలని పోలీసు అధికారులను కోరేందుకు సిద్ధమయ్యారు.

మొత్తంగా రూ.1.50 కోట్ల చిట్టీల వ్యవహారం చేర్యాలలో చర్చనీయాంశంగా మారింది. చిట్టీల నిర్వాహకుడిపై వచ్చిన ఆరోపణలపై పోలీసులు విచారణ చేపట్టి బాధితులకు న్యాయం చేస్తారా? కోర్టు నుంచి వచ్చిన ఐపీ నోటీసుల విషయంలో ఎలాంటి పరిణామాలు చోటుచేసుకుంటాయి? అన్నది వేచి చూడాలి.


Blogger ఆధారితం.