మరణంలోనూ వీడని బంధం.. గంటల వ్యవధిలోనే భార్యాభర్తల మృతి!

జనగామ జిల్లా స్టేషన్ ఘనపూర్‌లో హృదయ విదారక ఘటన.. భర్త మరణించిన కొద్ది గంటల్లోనే భార్య కన్నుమూత


 మరణంలోనూ వీడని బంధం.. గంటల వ్యవధిలోనే భార్యాభర్తల మృతి!

జనగామ జిల్లా స్టేషన్ ఘనపూర్‌లో హృదయ విదారక ఘటన.. భర్త మరణించిన కొద్ది గంటల్లోనే భార్య కన్నుమూత

స్టేషన్ ఘనపూర్: జీవితాంతం కష్టసుఖాల్లో కలిసిమెలిసి సాగిన ఆ దంపతుల ప్రయాణం.. చివరకు మరణంలోనూ విడదీయలేని బంధంగా మారింది. భర్త మరణవార్తను తట్టుకోలేక భార్య కూడా కొన్ని గంటల వ్యవధిలోనే ప్రాణాలు విడిచిన హృదయ విదారక ఘటన జనగామ జిల్లా స్టేషన్ ఘనపూర్ మున్సిపల్ పరిధిలోని చాగల్లు గ్రామంలో చోటుచేసుకుంది.

గ్రామానికి చెందిన వడ్లకొండ లోకనాథం (84), వడ్లకొండ రామక్క (75) దంపతులు. శుక్రవారం రాత్రి సుమారు 9:50 గంటలకు లోకనాథం కన్నుమూశారు. భర్త మరణంతో తీవ్ర మనోవేదనకు గురైన రామక్క కన్నీరుమున్నీరుగా విలపించారు. భర్త లేని జీవితాన్ని తట్టుకోలేకపోయిన ఆమె శనివారం తెల్లవారుజామున సుమారు 2:40 గంటల సమయంలో తుదిశ్వాస విడిచారు.

గతంలో జరిగిన ప్రమాదంలో రామక్క కాలుకు రాడ్డు వేయగా, అనంతరం ఇన్ఫెక్షన్ కారణంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. భార్య అనుభవిస్తున్న బాధను చూసి లోకనాథం కూడా ఎంతో మనోవేదనకు గురయ్యేవారని గ్రామస్థులు తెలిపారు.

వృద్ధాప్యంలోనూ ఒకరి ఆరోగ్యం గురించి మరొకరు ఆలోచిస్తూ, ఒకరికొకరు తోడుగా జీవించిన ఆ దంపతులు ఇలా ఒకే రాత్రి కన్నుమూయడం కుటుంబ సభ్యులను తీవ్ర విషాదంలో ముంచింది. వీరికి ఒక కుమార్తె, ఒక కుమారుడు ఉన్నారు. గంటల వ్యవధిలోనే తల్లిదండ్రులిద్దరినీ కోల్పోవడంతో పిల్లలు, బంధువులు కన్నీరుమున్నీరవుతున్నారు.

ఈ విషాద ఘటనతో చాగల్లు గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. జీవితాంతం కలిసి నడిచిన వారి బంధం.. చివరకు మరణంలోనూ విడదీయలేనిదిగా మారిందంటూ గ్రామస్థులు కన్నీటి పర్యంతమవుతున్నారు.


Blogger ఆధారితం.