-->

లక్ష లంచం తీసుకుంటూ ఏసీబికి చిక్కిన యువజన, క్రీడల అధికారి, టైపిస్ట్

 

రూ.3.10 లక్షల క్యాటరింగ్ బిల్లు విడుదలకు రూ.లక్ష లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్న ఏసీబీ

.లక్ష లంచం తీసుకుంటూ ఏసీబికి చిక్కిన యువజన, క్రీడల అధికారి, టైపిస్ట్

రూ.3.10 లక్షల క్యాటరింగ్ బిల్లు విడుదలకు రూ.లక్ష లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్న ఏసీబీ

మహబూబ్‌నగర్, నవంబర్ 5: ప్రభుత్వ కార్యాలయంలో లంచం తీసుకుంటూ ఇద్దరు అధికారులు ఏసీబీకి చిక్కారు. మహబూబ్‌నగర్ జిల్లా యువజన, క్రీడల శాఖ కార్యాలయంలో గురువారం ఈ ఘటన చోటుచేసుకుంది.

ఏసీబీ అధికారుల వివరాల ప్రకారం.. జిల్లా యువజన, క్రీడల అధికారి జక్కు రాజశేఖర్‌రెడ్డి, కాంట్రాక్ట్ ప్రాతిపదికన పనిచేస్తున్న టైపిస్ట్ గోరె ఉమేష్ కలిసి లంచం డిమాండ్ చేసినట్లు తెలిపారు.

మహబూబ్‌నగర్‌లోని SATG వాలీబాల్ హాస్టల్‌లో ఉంటున్న క్రీడాకారులకు ఆహారం సరఫరా చేసినందుకు సంబంధించిన ఆగస్టు నెల క్యాటరింగ్ బిల్లు రూ.3.10 లక్షలు పెండింగ్‌లో ఉంది. ఈ బిల్లును ప్రాసెస్ చేసి ఆమోదించడంతో పాటు చెక్కు విడుదల చేయడానికి సంబంధిత వ్యక్తి నుంచి రూ.1 లక్ష లంచం డిమాండ్ చేసినట్లు ఏసీబీ పేర్కొంది.

ఫిర్యాదు అందడంతో ఏసీబీ అధికారులు పక్కా ప్రణాళికతో ట్రాప్ నిర్వహించారు. ఈ క్రమంలో లంచం సొమ్మును స్వీకరిస్తుండగా జిల్లా యువజన, క్రీడల అధికారి జక్కు రాజశేఖర్‌రెడ్డిని ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఆయన వద్ద నుంచి రూ.1 లక్ష లంచం సొమ్మును స్వాధీనం చేసుకున్నారు.

ఏసీబీ తెలిపిన వివరాల ప్రకారం.. రాజశేఖర్‌రెడ్డి తన తరఫునే కాకుండా టైపిస్ట్ ఉమేష్ తరఫున కూడా లంచం స్వీకరించినట్లు వెల్లడైంది. లంచం మొత్తాన్ని పంచుకునేలా ఇద్దరి మధ్య ముందస్తు అవగాహన ఉన్నట్లు అధికారులు తెలిపారు.

అధికారిక పదవులను దుర్వినియోగం చేసి అక్రమ ప్రయోజనం పొందేందుకు ప్రయత్నించినట్లు ఏసీబీ పేర్కొంది. ఇద్దరు నిందితులను అరెస్టు చేసి నాంపల్లిలోని SPE & ACB కేసుల ప్రత్యేక న్యాయస్థానం ముందు హాజరుపరచనున్నట్లు వెల్లడించింది. కేసు దర్యాప్తు కొనసాగుతోంది.

లంచం అడిగితే 1064కు ఫిర్యాదు

ప్రభుత్వ ఉద్యోగి ఎవరైనా లంచం డిమాండ్ చేస్తే ప్రజలు ఏసీబీ టోల్‌ఫ్రీ నంబర్ 1064కు ఫిర్యాదు చేయాలని అధికారులు సూచించారు. అలాగే వాట్సాప్ 9440446106 ద్వారా కూడా ఏసీబీని సంప్రదించవచ్చని తెలిపారు. ఫిర్యాదుదారుడి వివరాలను గోప్యంగా ఉంచుతామని స్పష్టం చేశారు.

Blogger ఆధారితం.