ఘోర రోడ్డు ప్రమాదం.. ఆర్టీసీ బస్సు–డీసీఎం వ్యాన్ ఢీ.. ఆరుగురికి గాయాలు
ఖమ్మం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆర్టీసీ బస్సు–డీసీఎం వ్యాన్ ఢీ.. ఆరుగురికి గాయాలు
ఖమ్మం, నవంబర్ 03: ఖమ్మం జిల్లాలో మంగళవారం రాత్రి రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. తల్లాడ–దేవరపల్లి జాతీయ ప్రధాన రహదారిపై ఆర్టీసీ బస్సు, డీసీఎం వ్యాన్ ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో బస్సులో ప్రయాణిస్తున్న ఆరుగురు ప్రయాణికులు గాయపడ్డారు.
స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. సత్తుపల్లి ఆర్టీసీ డిపోకు చెందిన బస్సు ప్రయాణికులతో సత్తుపల్లి నుంచి ఖమ్మం వైపు వెళ్తోంది. అదే సమయంలో హైదరాబాద్ నుంచి తిరువూరుకు పచ్చళ్ల సీసాలను తీసుకెళ్తున్న డీసీఎం వ్యాన్ ఎదురుగా వస్తోంది.
ఈ క్రమంలో డీసీఎం వ్యాన్ ఓవర్టేక్ చేసే ప్రయత్నంలో రెండు వాహనాలు ఎదురెదురుగా బలంగా ఢీకొన్నాయి. ఈ ఘటనతో బస్సులో ప్రయాణిస్తున్న ఆరుగురు ప్రయాణికులు గాయపడగా, ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు స్పందించి సహాయక చర్యలు చేపట్టారు.
క్షతగాత్రులను చికిత్స నిమిత్తం కల్లూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న తల్లాడ పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని ప్రమాదానికి సంబంధించిన వివరాలను సేకరించారు
డీసీఎం వ్యాన్ ఓవర్టేక్ చేసే క్రమంలోనే ప్రమాదం జరిగినట్లు ప్రాథమికంగా తెలుస్తున్నప్పటికీ, ప్రమాదానికి గల పూర్తి కారణాలు పోలీసుల విచారణ అనంతరం వెల్లడికానున్నాయి. ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Post a Comment