రథం ఊరేగింపులో అపశృతి: ఇద్దరు భక్తుల మృతి (వీడియో)
కర్ణాటక రాష్ట్రం, హున్సూర్‌లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. మద్దూరమ్మ రథోత్సవ వేడుకల్లో భాగంగా నిర్వహించిన రథయాత్రలో రెండు రథాలు కూలిపోవడంతో ఇద్దరు భక్తులు మృతి చెందారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు.
ఊరేగింపులో విషాదం
ఆదివారం ఉదయం రథయాత్ర కార్యక్రమం వైభవంగా ప్రారంభమైంది. వేలాదిమంది భక్తులు ఉత్సాహంగా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. అయితే బెంగళూరు జాతీయ రహదారి వద్దకు రథం చేరుకున్న సమయంలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. బలమైన గాలులు వీచడంతో ఊహించని అపశృతి చోటుచేసుకుంది.
రథాల కూలింపుతో భక్తుల ప్రాణాలు బలి
బలమైన గాలుల ప్రభావంతో రెండు రథాలు ఒక్కసారిగా కూలిపోయాయి. ఈ ప్రమాదంలో తమిళనాడులోని హోసూర్‌కు చెందిన రోహిత్ (26), బెంగళూరుకు చెందిన జ్యోతి (14) రథాల కింద పడిపోయి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. లక్కసంద్రకు చెందిన రాకేష్, మరో మహిళ తీవ్రంగా గాయపడ్డారు.
ఇంకా రెండు రథాలకు ప్రమాదం
అంతేకాకుండా, దొడ్డనాగరమంగళ గ్రామ రథం చిక్కనగరమంగళ సమీపంలో కూలిపోయింది. అదృష్టవశాత్తూ, ఈ ఘటనలో ఎవరూ మరణించలేదు. మరోవైపు రాయసంద్ర గ్రామ రథం ఊరేగింపులో ప్రజలపై పడింది. ఈ ప్రమాదంలో కొంతమంది భక్తులు రథం కింద చిక్కుకున్నారని అధికారులు వెల్లడించారు.
రథాల ఎత్తుపై పోటీనే కారణమా?
హుస్కూర్ మద్దూరమ్మ జాతరలో గ్రామాల మధ్య రథాల ఎత్తుపై పోటీ ఉత్సాహంగా జరుగుతుందనే విషయం తెలిసిందే. ప్రతి గ్రామం తమ రథం అత్యంత ఎత్తుగా ఉండాలని పోటీ పడుతుంటాయి. భారీ ఎత్తున రథాలను నిర్మించడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు భావిస్తున్నారు.
పోలీసుల విచారణ కొనసాగుతోంది. భక్తుల భద్రత కోసం మరింత కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని అధికారులు సంకల్పించారు.

Post a Comment